Facebook: ఫేస్ బుక్ పై దిగ్గజ కంపెనీల ఆగ్రహం... ఇప్పటికే సుమారు రూ. 52 వేల కోట్ల నష్టం!

With Ad Ban Campaign Face Book Loss Already 72 Billions

  • తప్పుడు వార్తలను తీసేయడం లేదని ఆగ్రహం
  • వ్యాపార ప్రకటనలు నిలిపివేసిన దిగ్గజ కంపెనీలు
  • 160 కంపెనీల నుంచి యాడ్స్ కోల్పోయిన ఫేస్ బుక్
  • నష్ట నివారణ చర్యల్లో మార్క్ జుకర్ బర్గ్

ప్రపంచ మల్టీ నేషనల్ కంపెనీల ఆగ్రహం ఫేస్ బుక్ ను కుదేలు చేస్తోంది. తన వెబ్ సైట్ నుంచి హేట్ స్పీచ్ అంశాలను తొలగించే చర్యలు తీసుకోవడం లేదంటూ కంపెనీపై ఆరోపణలు రాగా, ఫేస్ బుక్ కు ఇస్తున్న వ్యాపార ప్రకటనలను నిలిపివేయాలని పలు కంపెనీలు నిర్ణయించాయి. ఇప్పటికే ఈ ప్రభావం సంస్థపై పడింది. శుక్రవారం నాటి యూఎస్ మార్కెట్లో ఫేస్ బుక్ ఈక్విటీ 8 శాతానికి పైగా పతనం కాగా, 72 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 52 వేల కోట్లు) నష్టం వాటిల్లింది.

ఇక తాజాగా ఫేస్ బుక్ కు వ్యాపార ప్రకటనలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్న కంపెనీల్లో శీతల పానీయ దిగ్గజం కోకా-కోలాతో పాటు స్టార్ బక్స్, వెరిజాన్ తదితర సంస్థలు వచ్చి చేరాయి. జూలైలో తాము ఫేస్ బుక్ లో ప్రకటనలు ఇవ్వలేమని స్పష్టం చేశాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఫేస్ బుక్ కు ప్రకటనలు ఇవ్వరాదని నిర్ణయించిన కంపెనీల జాబితా సుమారు 160కి చేరింది.

ఫేస్ బుక్ పై వచ్చిన ఆరోపణలను పరిశీలిస్తే, జార్జ్ ఫ్లాయిడ్ మృతి తరువాత "బ్లాక్ లివ్స్ మాటర్" నిరసనకారులకు వ్యతిరేకంగా హింసాత్మక పోస్టులు ఫేస్ బుక్ లో కనిపిస్తుంటే, వాటిని తీసేయడంలో విఫలమైంది. వామపక్ష భావజాలాలున్న వెబ్ సైట్ 'బ్రెయిట్ బార్ట్'ను నమ్మకమైన వార్తలకు సోర్స్ గా అభివర్ణించి ఫేస్ బుక్ మరో తప్పు చేసింది. తప్పుడు వార్తల ప్రచారాన్ని అడ్డుకోలేకపోయింది. యూఎస్ లో నల్లజాతి ఓటర్లకు వ్యతిరేకంగా పోస్టులు వస్తుంటే పట్టించుకోలేదన్న ఆరోపణలూ ఉన్నాయి.

ఇప్పటికే ఫేస్ బుక్ కు ప్రకటనలు ఆపేసిన కంపెనీల జాబితాలో యూరప్ కన్స్యూమర్ గూడ్స్ దిగ్గజం, డవ్ సోప్, లిప్టన్ చాయ్ తదితర బ్రాండ్లను అందిస్తున్న యూనీలివర్, అవుట్ డౌర్ అపెరల్, ఎక్విప్ మెంట్ కంపెనీలు పాటగోనియా, ఆర్క్ టిరిక్స్, ది నార్త్ ఫేస్, జాన్ స్పోర్ట్, ఎడ్డీ బుయర్, ఆర్ఈఐ తదితరాలున్నాయి. వీటితో పాటు హార్ష్ లీస్, రిక్రూట్ మెంట్ సేవల సంస్థ అప్ వర్క్, చిత్ర నిర్మాణ సంస్థ మంగోలియా పిక్చర్స్, పాస్ వర్డ్ మేనేజర్ డ్యాష్ లైన్, హోండా సంస్థ యూఎస్ డివిజన్, జీన్స్ తయారీదారు లెవీ స్టారస్ లు కూడా ప్రకటనలను నిలిపివేశాయి.

ఈ పరిణామాలు ఫేస్ బుక్ లో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన వారిని ఆందోళనకు గురిచేస్తుండగా, అంతే ఆందోళన సంస్థ యాజమాన్యంలోనూ నెలకొని వుందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత సంవత్సరం ఫేస్ బుక్ సంస్థ వ్యాపార ప్రకటనల ద్వారా దాదాపు 102 బిలియన్ డాలర్ల ఆదాయం (సుమారు రూ. 80 వేల కోట్లకుపైగా) సమకూర్చుకుంది. ఈ సంవత్సరం ఈ ఆదాయంలో అధిక మొత్తాన్ని కోల్పోక తప్పదని అంచనా.

జరుగుతున్న నష్టాన్ని దగ్గరి నుంచి చూస్తున్న ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్, ఇప్పటికే నష్ట నివారణ చర్యలు ప్రారంభించారు. సరైన సమాచారం ఉంటేనే పోస్టులను ఉంచేలా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. నవంబర్ లో యూఎస్ లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మరింత జాగ్రత్తగా ఉంటామన్నారు. పౌర హక్కుల సంఘాలు, నిపుణులతో సలహాలు తీసుకుని, మరిన్ని టూల్స్ ను అభివృద్ధి చేస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News