New Delhi: ఢిల్లీ ఎయిర్ పోర్టులో కరోనా పరీక్షల నుంచి తప్పించుకున్న వ్యక్తి... వెంటాడి పట్టుకున్న పోలీసులు!
- కజకిస్థాన్ నుంచి వచ్చిన హర్జీత్ సింగ్
- ఘజియాబాద్ లో పట్టుకున్న పోలీసులు
- 14 రోజుల క్వారంటైన్, పలు సెక్షన్ల కింద కేసులు
కజకిస్థాన్ నుంచి న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో దిగిన ఓ వ్యక్తి, కరోనా స్క్రీనింగ్ చేయించుకోకుండా తప్పించుకుని పోగా, పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే, హర్జీత్ సింగ్ (72) అనే వ్యక్తి ఎయిర్ ఇండియా ఫ్లయిట్ నంబర్ 1916లో కజక్ లోని అల్మాటీ నుంచి శనివారం నాడు న్యూఢిల్లీకి వచ్చాడు. ఆపై అతను అధికారుల కళ్లుగప్పి ఎయిర్ పోర్టు నుంచి పారిపోయాడు. వాస్తవానికి అతను టర్మినల్-3లోని స్క్రీనింగ్ హాల్ కు వెళ్లాల్సి వుండగా, అక్కడికి పోకుండానే బయటకు వెళ్లిపోయాడు.
ఆపై అతన్ని గుర్తించేందుకు ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేసిన పోలీసులు ఘజియాబాద్ లో అతన్ని గుర్తించారు. ఆపై 14 రోజుల హోమ్ క్వారంటైన్ కు తరలించారు. హర్జీత్ సింగ్ కావాలనే స్క్రీనింగ్ ను తప్పించుకుని వెళ్లిపోయాడని, ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకుని కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ గైడ్ లైన్స్ మేరకు క్వారంటైన్ చేశామని పోలీసులు వెల్లడించారు. అతనిపై ఐపీసీ, ఎపిడమిక్ యాక్ట్ ప్రకారం కేసు రిజిస్టర్ చేశామని తెలిపారు. అతను ఇచ్చిన మొబైల్ ఫోన్ నంబర్, చిరునామాలు అవాస్తవమని, అయితే, సీసీటీవీ ఫుటేజీల్లో అతను ప్రయాణించిన వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా అతన్ని గుర్తించామని చెప్పారు.