Singam: ఇకపై పోలీసులను హైలైట్ చేస్తూ సినిమాలు తీయను: సంచలన ప్రకటన చేసిన 'సింగం', 'సామి' దర్శకుడు హరి!
- సూర్య, విక్రమ్ లతో సూపర్ హిట్ చిత్రాలు
- తండ్రీ కొడుకుల లాకప్ డెత్ విషయంలో ఆగ్రహం
- అలాంటి చిత్రాలు తీసినందుకు సిగ్గుపడుతున్నానన్న హరి
దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన తమిళనాడు తండ్రీ కొడుకుల లాకప్ డెత్ నేపథ్యంలో, స్టార్ హీరోలు సూర్య, విక్రమ్ లతో 'సింగం', 'సామి' వంటి సూపర్ హిట్ చిత్రాల సిరీస్ లకు దర్శకత్వం వహించిన హరి గోపాలకృష్ణన్, సంచలన నిర్ణయం తీసుకున్నారు.
తూత్తుకూడి సమీపంలోని పాతాంకుళంలో తండ్రీ కొడుకులను అరెస్ట్ చేసిన పోలీసులు, వారిని లాకప్ లో తీవ్రంగా హింసించి చంపారని పలు ప్రాంతాల్లో ఆందోళనలు జరుగుతున్న వేళ, హరి ఓ ప్రకటన విడుదల చేశారు. పోలీసుల ధైర్య సాహసాలను హైలైట్ చేస్తూ ఎన్నో చిత్రాలను నిర్మించిన తాను, ఇప్పుడు సిగ్గుపడుతున్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు.
జయరాజ్, బెన్నిక్స్ హత్యలు అత్యంత దారుణమని, మరోసారి ఇటువంటి ఘటనలు తమిళనాడులో జరుగకూడదని కోరుకుంటున్నానని హరి గోపాలకృష్ణన్ వ్యాఖ్యానించారు. కొంతమంది కారణంగా మొత్తం పోలీసు శాఖ ప్రతిష్ఠ పాతాళానికి పడిపోయిందని అన్నారు. పోలీసుల సేవలను ప్రశంసిస్తూ, తాను ఐదు సినిమాలు తీసినందుకు ఇప్పుడు చింతిస్తున్నానని, మరోసారి ఇలాంటి సినిమాలను చేయబోనని అన్నారు.