Sonu Sood: నా జీవితంలో ఇది అరుదైన దశ... మాటల్లో వర్ణించలేను: సోనూ సూద్
- లాక్ డౌన్ తో కష్టాల్లో చిక్కుకున్న వలసజీవులు
- వలస కార్మికుల కోసం కోట్ల రూపాయలు వెచ్చించిన సోనూ సూద్
- ఇప్పటికీ కాల్స్ వస్తూనే ఉన్నాయని వెల్లడి
దేశంలో కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ వలసజీవుల పాలిట శాపంలా మారిన తరుణంలో బాలీవుడ్ నటుడు సోనూ సూద్ నేనున్నానంటూ ముందుకు వచ్చాడు. తమ స్వస్థలాలకు వెళ్లేందుకు తపించిపోయిన వలస కార్మికులపాలిట ఆపద్బాంధవుడే అయ్యాడు. కోట్ల రూపాయలు ఖర్చుచేసి బస్సులు, రైళ్లు, విమానాల ద్వారా వలస కార్మికులను వారి స్వస్థలాలకు చేర్చాడు.
దీంతో సినిమాల్లో విలన్ పాత్రలు పోషించే సోనూ సూద్ రియల్ లైఫ్ లో ఓ హీరో అయ్యాడు. సోషల్ మీడియాలో అయితే, సోనూకు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోనూ సూద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జీవితంలో ఒక మంచి పని చేసే అవకాశం దక్కిందని, జీవితంలో ఇది ఒక అరుదైన దశ అని, దీన్ని మాటల్లో వర్ణించలేనని అన్నారు. తమ స్వస్థలాలకు వెళుతున్న కార్మికులను రైల్వే స్టేషన్ కు, బస్టాండ్లకు వెళ్లి కలిసినప్పుడు కలిగే ఆనందం అంతాఇంతా కాదని అన్నారు. ఇప్పటికీ తమ హెల్ప్ లైన్ నెంబర్లకు వందల కొద్దీ కాల్స్ వస్తున్నాయని, వారి వివరాలు పూర్తిగా పరిశీలించి, తరలింపుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ముంబై రావాలనుకునేవారికి కూడా తాము సాయం చేస్తున్నామని సోనూ వెల్లడించారు.