Cholesterol: కరోనా మరణాల శాతాన్ని దాదాపు సగానికి సగం తగ్గిస్తున్న కొలెస్ట్రాల్ ఔషధాలు!
- చైనాలో ఆసక్తికర అధ్యయనం
- ఇమ్యూనిటీ కణాల స్పందన మెరుగుపర్చుతున్నట్టు గుర్తింపు
- వెంటిలేటర్ అవసరాన్ని తగ్గిస్తున్న కొలెస్ట్రాల్ ఔషధాలు
చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన వైరస్ మహమ్మారి కరోనా కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే ప్రపంచం మొత్తం పాకిపోయింది. ఈ వైరస్ సోకితే నిర్దిష్టమైన చికిత్సా విధానం కానీ, ఔషధాలు కానీ లేవు. కేవలం కరోనా పాజిటివ్ వ్యక్తిలో కనిపించే లక్షణాల ఆధారంగా ఔషధాలు ఇస్తూ, శరీరంలో వైరస్ శాతం తగ్గిస్తూ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. తాజాగా ఓ అధ్యయనంలో ఆసక్తికర అంశం వెల్లడైంది.
సాధారణంగా మనలో కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఉపయోగించే మందులు కరోనా రోగులపై విశేషంగా ప్రభావం చూపుతున్నట్టు గుర్తించారు. కరోనా తీవ్రత ఎక్కువై ఆసుపత్రిపాలైన రోగులను మరణం నుంచి కాపాడడంలో కొలెస్ట్రాల్ ఔషధాల పనితీరు అద్భుతమని వుహాన్ లోని రెన్ మిన్ ఆసుపత్రి చేపట్టిన అధ్యయనం పేర్కొంటోంది. కరోనా కారణంగా ఊపిరితిత్తుల్లో ఏర్పడే ప్రమాదకరమైన పుండ్లను ఈ మందులు నయం చేస్తున్నాయని, కణజాల వాపును అరికడుతున్నాయని పరిశోధకులు వివరించారు. ఈ మందులు కరోనా రోగిలో వ్యాధి నిరోధక కణాల స్పందనను మెరుగు పర్చుతున్నాయని తెలిపారు.
హుబేయ్ ప్రావిన్స్ లోని 21 ఆసుపత్రులలోని 13,981 మంది కరోనా పేషెంట్ల చికిత్స తీరుతెన్నులను ఈ అధ్యయనంలో భాగంగా పరిశీలించారు. మొత్తం 28 రోజుల పాటు పరిశోధకులు అధ్యయనం చేపట్టిన పిమ్మట... కొలెస్ట్రాల్ ఔషధాలు వాడిన రోగుల్లో మరణాల శాతం కేవలం 5.2 మాత్రమే ఉండగా, కొలెస్ట్రాల్ ఔషధాలు వాడని రోగుల్లో మరణాల శాతం 9.4గా నమోదైనట్టు గుర్తించారు.
అంతేకాదు, ఈ తరహా ఔషధాలు వాడిన రోగులకు వెంటిలేటర్, ఐసీయూ అవసరం చాలా తక్కువగానే వచ్చిందని అధ్యయనం ద్వారా వెల్లడైంది. మొత్మమ్మీద కొలెస్ట్రాల్ తగ్గించడానికి వాడే మందులు ఇప్పుడు కరోనా రోగుల్లో వ్యాధి తీవ్రతను తగ్గించడానికి కూడా సమర్థంగా ఉపయోగపడుతున్నాయని చైనా పరిశోధకులు అంటున్నారు.