Raghurama Krishnam Raju: ఆ విషయం అర్థంకాకే తల బద్దలు కొట్టుకుంటున్నా: రఘురామకృష్ణరాజు
- ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన నరసాపురం ఎంపీ
- పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడలేదని స్పష్టీకరణ
- సీఎంకు కూడా నోటీసులు పంపుతాడేమోనంటూ వ్యంగ్యం
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్ర చర్చనీయాంశంగా మారారు. గత కొన్నిరోజులుగా ఆయన వైసీపీలోని అంతర్గత కలహాలతో సతమతమవుతున్నారు. ఇటీవలే ఆయనకు పార్టీ అధినాయకత్వం షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది.
ఈ నేపథ్యంలో ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తనకు పంపిన షోకాజ్ నోటీసులు కూడా నేరుగా తనకు అందలేదని, ఓ మీడియా సంస్థ ద్వారా వచ్చినట్టు తెలిపారు. తాను ఇంతవరకు పార్టీకి వ్యతిరేకంగా ఒక్క ముక్క కూడా మాట్లాడలేదని, కానీ తనకు షోకాజ్ నోటీసులు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు నోటీసులు ఎందుకు పంపారో ఇప్పటికీ అర్థంకాక తల బద్దలు కొట్టుకుంటున్నానని తెలిపారు.
తాను బహిరంగంగా మాట్లాడింది మూడ్నాలుగు సార్లేనని అన్నారు. ఓసారి పార్లమెంటులో భాష గురించి మాట్లాడానని, ఏపీలో స్కూళ్లను ఇంగ్లీషు మీడియం చేద్దామనుకుంటే దానిపై ఎందుకు మాట్లాడావని సీఎం జగన్ సంజాయిషీ అడిగితే ఆయనకు వివరణ ఇచ్చానని వెల్లడించారు.
మరో సందర్భంలో టీటీడీ గురించి మాట్లాడానని, భక్తులు ఇచ్చిన ఆస్తులను కాపాడుకోలేక అమ్ముకోవడం సరికాదని, ఆస్తుల విక్రయాలు ఆపాలని సీఎంకు మీడియా ద్వారా తెలియజేశానని వివరించారు. ఆస్తుల విక్రయం నిర్ణయాన్ని సీఎం జగన్ కూడా విరమించుకున్నారని, కానీ ఆ విషయంలో పార్టీ జనరల్ సెక్రటరీ తనకు నోటీసులు పంపడం ఏంటో తెలియడంలేదని, పార్టీ జాతీయ అధ్యక్షుడైన సీఎంకు కూడా నోటీసులు పంపుతాడేమోనంటూ వ్యంగ్యంగా అన్నారు.