Lockdown: అన్‌లాక్-2 మార్గదర్శకాలు వచ్చేశాయి.. ఇక దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా స్వేచ్ఛగా వెళ్లొచ్చు!

Unlock 2 guidelines issued by union government

  • కంటెయిన్‌మెంట్ జోన్లలో జులై 31 వరకు లాక్‌డౌన్
  • విద్యాసంస్థలు, కోచింగ్ కేంద్రాలకు అనుమతి నిరాకరణ
  • బస్సులు, రైళ్లు దిగి గమ్యస్థానాలకు వెళ్లే వారిని అడ్డుకోకూడదు

రేపటి నుంచి అన్‌లాక్-2 మొదలు కానున్న నేపథ్యంలో కేంద్రం నిన్న రాత్రి సరికొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈసారి లాక్‌డౌన్ ఆంక్షలను మరిన్ని సడలించింది. కంటెయిన్‌మెంట్ జోన్లలో జులై 31 వరకు లాక్‌డౌన్ కొనసాగుతుందని కేంద్ర హోంమంత్రిత్వశాఖ విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. అలాగే, ముందస్తు అనుమతులు, ఈ-పర్మిట్ల అవసరం లేకుండానే ప్రయాణికులు, సరుకు రవాణా వాహనాలు దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా తిరగొచ్చని స్పష్టం చేసింది.

తాజా మార్గదర్శకాల ప్రకారం... విద్యాసంస్థలు, కోచింగ్ కేంద్రాలు, అంతర్జాతీయ విమాన ప్రయాణాలు, మెట్రో రైళ్లు, సినిమా హాళ్లు, వ్యాయామశాలలు, పార్కులు, థియేటర్లు, స్విమ్మింగ్ పూల్స్, బార్లు, ఆడిటోరియంలు, అసెంబ్లీ హాళ్లు, సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్య, సాంస్కృతిక, మతపరమైన అన్ని కార్యక్రమాలు, భారీ సమావేశాలపై జులై 31 వరకు నిషేధం అమల్లో ఉంటుంది.

దేశీయ విమాన సర్వీసులు, పరిమితంగా రైళ్ల రాకపోకలు, ఆన్‌లైన్ విద్య, దూర విద్య తదితర వాటిని కొనసాగించవచ్చు. జులై 15 నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల శిక్షణ సంస్థలను తిరిగి తెరవవచ్చు. కంటెయిన్‌మెంట్ జోన్ల వెలుపల ప్రార్థన మందిరాలు, హోటళ్లు, ఆతిథ్య సేవలు, షాపింగ్ మాల్స్ తదితర వాటిని తెరుచుకోవచ్చు.

అలాగే, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి, రాష్ట్ర పరిధిలో ఓ చోటు నుంచి మరో చోటుకి వెళ్లేందుకు మనుషులకు కానీ, సరుకు రవాణా వాహనాలకు కానీ ఎలాంటి అనుమతులు అవసరం లేదు. రాత్రి పూట విధిస్తున్న కర్ఫ్యూ యథావిధిగా కొనసాగుతుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ కొనసాగుతుంది.

రైళ్లు, బస్సులు, విమానాలు దిగి గమ్యస్థానాలకు వెళ్లే వారిని అడ్డుకోకూడదని మార్గదర్శకాల్లో స్పష్టంగా పేర్కొంది. అత్యవసర కార్యకలాపాలకు కంటెయిన్‌మెంట్ జోన్లలో అనుమతి ఇవ్వాలి. స్థానిక పరిస్థితులను బట్టి కంటెయిన్‌మెంట్ జోన్లు కాని ప్రాంతాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధించుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News