Netflix: 'కృష్ణా అండ్ హిజ్ లీల' ఎఫెక్ట్.. ఇబ్బందుల్లో నెట్ ఫ్లిక్స్!
- ఇటీవల విడుదలైన కృష్ణా అండ్ హిజ్ లీల
- హిందువుల మనోభావాలు దెబ్బతినేలా చిత్రం
- 'బాయ్ కాట్ నెట్ ఫ్లిక్స్' హ్యాష్ ట్యాగ్ వైరల్
ఇటీవల ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన 'కృష్ణా అండ్ హిజ్ లీల' సినిమాకు హిందూవాదం సెగ తగిలింది. ఈ చిత్రంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. ఇందులో కృష్ణ అనే పేరున్న పాత్ర, పలువురితో లైంగిక సంబంధాలు పెట్టుకోవడం, వారిలో ఓ యువతి పేరు రాధ కావడం సమస్యలను తెచ్చిపెట్టింది.
ఈ షో హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వుందని, దీన్ని వెంటనే బాయ్ కాట్ చేయాలంటూ, 'బాయ్ కాట్ నెట్ ఫ్లిక్స్' పేరిట హ్యాష్ ట్యాగ్ వైరల్ అవుతోంది. నెట్ ఫ్లిక్స్ లో అభ్యంతరకరమైన దృశ్యాలున్న ఎన్నో చిత్రాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమ్ అవుతున్నాయని గతంలోనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 'కృష్ణా అండ్ హిజ్ లీల' నెట్ ఫ్లిక్స్ మెడపై కత్తిని పెట్టింది.
భారత సంస్కృతిని, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న ఎటువంటి చిత్రాలను, షోలను అంగీకరించే ప్రసక్తే లేదని పలువురు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. కాగా, ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించగా, పెరేవు రవికాంత్ దర్శకత్వం వహించాడు. సిద్ధు, షాలినీ, శ్రద్ధ శ్రీనాథ్, సీరత్ కపూర్, సంయుక్త హూర్నడ్ లు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.