Bandi Sanjay: తెలంగాణలో లీకేజీల ప్రభుత్వం నడుస్తోంది: బండి సంజయ్
- కొండపోచమ్మ ప్రాజెక్టు కెనాల్ కు గండి
- ప్రభుత్వమే బాధ్యత వహించాలన్న బండి సంజయ్
- కాంట్రాక్టర్ల లైసెన్స్ రద్దు చేయాలని డిమాండ్
కొండపోచమ్మ ప్రాజెక్టు కెనాల్ కు గండిపడిన ఘటనపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడికక్కడ ప్రాజెక్టుల వద్ద గండ్లు పడి నీళ్లు లీకవుతున్నాయని, రాష్ట్రంలో లీకేజీల ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. కాళేశ్వరం, మిడ్ మానేరు, మల్లన్న సాగర్, కొండపోచమ్మ... ఇలా అన్ని ప్రాజెక్టుల్లో గండ్లు పడ్డాయని, ఈ లీకేజీలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు.
కాంట్రాక్టర్లతో ప్రభుత్వం కుమ్మక్కు కావడం వల్లే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ పెద్దల బినామీలే కాంట్రాక్టర్లు కావడంతో ఇలాంటి లీకేజీలు చోటుచేసుకుంటున్నాయని, కాంట్రాక్టర్ల లైసెన్స్ లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్కాముల కోసమే స్కీములు పెట్టారని, అందుకు కొండపోచమ్మ కెనాల్ కు పడిన గండి నిదర్శనమని ఆరోపించారు. ప్రాజెక్టుల సమీప గ్రామాల ప్రజలు ఈ లీకేజీలతో హడలిపోతున్నారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.