Chingari: టిక్ టాక్ పోయింది... ఈ యాప్ పంట పండింది!
- 59 చైనా యాప్ లపై కేంద్రం నిషేధం
- టిక్ టాక్ పైనా నిషేధం
- 'చింగారీ' యాప్ కు పెరిగిన ఆదరణ
- గంటలో లక్ష డౌన్ లోడ్లు
ఇటీవల భారత్-చైనా సరిహద్దుల్లో చోటు చేసుకున్న పరిణామాలు వాణిజ్య రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. భద్రతా కారణాల రీత్యా నష్టదాయకం అని భావించి 59 చైనా యాప్ లపై కేంద్రం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో టిక్ టాక్, హలో యాప్ వంటి పాప్యులర్ యాప్ లు నిలిచిపోయాయి. అయితే, టిక్ టాక్ ప్రభావంతో వీడియోలకు బాగా అలవాటు పడిన భారత నెటిజన్లను ఇప్పుడు మరో యాప్ విశేషంగా ఆకర్షిస్తోంది. దీని పేరు 'చింగారీ'. ఇది దేశీయంగా రూపొందిన యాప్. దీన్ని మహీంద్రా గ్రూప్ అధినేత, టెక్ ప్రియుడు ఆనంద్ మహీంద్రా కూడా డౌన్ లోడ్ చేసుకోవడం విశేషం.
ఇది ఇంగ్లీష్, హిందీ, తెలుగు వంటి అనేక భారతీయ భాషల్లో లభ్యమవుతోంది. అచ్చం టిక్ టాక్ తరహాలోనే ఉంటుంది. టిక్ టాక్ పై నిషేధంతో ఈ 'చింగారీ' యాప్ కు డౌన్ లోడ్లు విపరీతంగా పెరిగిపోయాయి. 60 నిమిషాల వ్యవధిలో ఈ యాప్ ను లక్ష మంది డౌన్ లోడ్ చేస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఇప్పటివరకు ఈ యాప్ 30 లక్షల డౌన్ లోడ్లు సాధించింది. అంతేకాదు, ఈ యాప్ వ్యూయింగ్ రేట్ కూడా ఎంతో మెరుగైంది. ప్రతి గంటకు ఈ యాప్ ను వీక్షిస్తున్న వారి సంఖ్య 20 లక్షల వరకు నమోదవుతోందట.