Pawan Kalyan: స్వర్ణకారులకు ఇది నిజంగా విపత్కర పరిస్థితి... ప్రభుత్వమే ఆదుకోవాలి: పవన్ కల్యాణ్
- కరోనా కారణంగా స్వర్ణకారులు ఉపాధి కోల్పోయారన్న పవన్
- స్వర్ణకారులను ఎవరూ పట్టించుకోవడంలేదని ఆవేదన
- 14 లక్షల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయన్న జనసేనాని
లాక్ డౌన్ నేపథ్యంలో స్వర్ణకారులు తమ ఉపాధికి దూరమయ్యారని, అయినప్పటికీ వారిపై పాలకులు ఎలాంటి దృష్టి పెట్టకపోవడం బాధాకరమని జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. కరోనా వ్యాప్తి కారణంగా మరికొన్ని నెలల పాటు ప్రజలు ఎలాంటి శుభకార్యాలు చేసుకునే స్థితిలో లేరని, బంగారు, వెండి ఆభరణాల తయారీకి విఘాతం ఏర్పడుతోందని వెల్లడించారు. రాష్ట్రంలో 14 లక్షల స్వర్ణకార, విశ్వబ్రాహ్మణ కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వివరించారు.
కరోనా భయంతో ఎవరూ వేడుకలు చేసుకునే పరిస్థితి కనిపించడంలేదని, స్వర్ణకారులకు ఇది నిజంగా కష్టకాలమేనని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. వృత్తి ఆధారితమైన బీసీ కులాలతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని, తమ ప్రయోజనాలు నెరవేరాక ఈ కులాలను పట్టించుకునేవారే లేరని ఆరోపించారు.
కాగా, స్వర్ణకారులు జీవో 272 కారణంగా పోలీసుల చేతిలో వేధింపులకు గురవుతున్నారని తెలిపారు. అనవసరపు వేధింపులతో స్వర్ణకారుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయొద్దని పోలీసులకు హితవు పలికారు. తప్పేదైనా ఉంటే స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో విచారణ జరిపి కేసులు నమోదు చేయాలని స్వర్ణకారులు కోరుతున్నారని వెల్లడించారు.
ఈ వృత్తిలో ఉన్నవారికి 45 ఏళ్లకే వృద్ధాప్య ఛాయలు వస్తున్నాయని, పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. వారికి గుర్తింపు కార్డులు ఇచ్చి ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని పవన్ డిమాండ్ చేశారు. స్వర్ణకారుల్లో చాలామందికి ముడి సరుకు బంగారం, వెండి కొనే శక్తి లేదని, వారికి రుణ సదుపాయం కల్పించాలని, నగల తయారీకి క్లస్టర్లు ఏర్పాటు చేసి ఎంఎస్ఎంఈల తరహాలో ప్రోత్సాహం కల్పిస్తే ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని తెలిపారు.
అంతేకాకుండా, స్వర్ణకారులకు కార్పొరేట్ జ్యుయెలరీ షాపుల్లో ఉపాధి కల్పించాలని కూడా సూచించారు. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే 70 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలనే ప్రభుత్వం, స్వర్ణకారుల విషయంలో కార్పొరేట్ షాపులకు ఎందుకు జీవో ఇవ్వదని ప్రశ్నించారు.