India: 2011 వరల్డ్ కప్ ఫైనల్... ఫిక్సింగ్ ఆరోపణలపై విచారణకు హాజరైన అరవింద్ డిసిల్వా!

Srilanka Start Enquiry on 2011 WC Final Fixing Alegations

  • విచారణకు ప్రత్యేక విభాగం ఏర్పాటు
  • నేడు ఉపుల్ తరంగను ప్రశ్నించనున్న అధికారులు
  • ఆ మ్యాచ్ లో 20 బంతులాడి రెండు పరుగులే చేసిన తరంగ
  • పలువురిని ప్రశ్నిస్తామన్న యాంటీ కరప్షన్ యూనిట్

2011లో జరిగిన వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ ఫిక్సయిందన్న ఆరోపణలపై విచారణను ప్రారంభించిన శ్రీలంక అధికారులు మాజీ కెప్టెన్, ప్రస్తుత చీఫ్ సెలక్టర్ అరవింద డిసిల్వాను ప్రశ్నించారు. శ్రీలంకలో కొత్తగా ఏర్పాటు చేయబడిన క్రీడా సంబంధిత అవినీతి వ్యతిరేక విభాగం ఆయన్ను దాదాపు 6 గంటల పాటు వివిధ అంశాలపై ప్రశ్నించింది. ఈ విషయాన్ని యాంటీ కరప్షన్ యూనిట్ సూపరింటెండెంట్ జగత్ ఫోన్సెకా వెల్లడించారు. 2011 వరల్డ్ కప్ ఫైనల్ ఇండియా, శ్రీలంకల మధ్య జరిగిందని గుర్తు చేసిన ఆయన, నేటి నుంచి విచారణను ప్రారంభించామని, అప్పటి జట్టులో ఉన్న ఉపుల్ తరంగకు ఇప్పటికే సమన్లు జారీ చేశామని ఆయన తెలిపారు.

తొలుత డిసిల్వాను ప్రశ్నించామని, బుధవారం నాడు ఉపుల్ తరంగ స్టేట్ మెంట్ ను రికార్డు చేస్తామని వెల్లడించిన ఆయన, ఈ మ్యాచ్ ఫిక్స్ అయిందనడానికి అంతర్జాతీయ వర్గాల నుంచి ఆధారాలను సేకరిస్తున్నామని, క్రికెట్ చరిత్రలో అతిపెద్ద మ్యాచ్ ఫిక్సింగ్ వివాదం ఇదేనని ఫోన్సెకా అభిప్రాయపడ్డారు. కాగా, విచారణ అనంతరం తిరిగి వెళ్లే సమయంలో అరవిండ డిసిల్వా ఎటువంటి కామెంట్లూ చేయకపోవడం గమనార్హం.

లంకలో పనిచేస్తున్న మూడు డిటెక్టివ్ విచారణల టీమ్ లు ఫైనల్ మ్యాచ్ లో గెలుపును ఇండియాకు అమ్మేశారని, అందుకు తమవద్ద సాక్ష్యాలు ఉన్నాయని వెల్లడించిన నేపథ్యంలో ఈ విచారణ ప్రారంభమైంది. నాటి మ్యాచ్ లో ఓపెనర్ గా బరిలోకి దిగిన ఉపుల్ తరంగ, 30 నిమిషాల పాటు క్రీజులో ఉండి, 20 బంతులను ఎదుర్కొని కేవలం 2 పరుగులు మాత్రమే చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపైనే ప్రధానంగా తరంగను ప్రశ్నించనున్నారని సమాచారం.

ఈ మ్యాచ్ లో శ్రీలంక జట్టు తొలుత బ్యాటింగ్ చేసి 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేయగా, ఆపై సచిన్ 18 పరుగులకే పెవీలియన్ కు చేరడంతో, లంక గెలుపు ఖాయమని అంతా భావించారు. అయితే, ధోనీ నాయకత్వంలోని ఇతర ఆటగాళ్లు మ్యాచ్ ని గెలిపించి, రెండోసారి వరల్డ్ కప్ ను ఇండియాకు తెచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News