108: 108 సిబ్బందికి గుడ్ న్యూస్.. జీతాలను భారీగా పెంచిన ఏపీ ప్రభుత్వం!
- డ్రైవర్ల జీతాలు రూ. 20 వేల వరకు పెంపు
- టెక్నీషియన్ల జీతాలు రూ. 30 వేలకు పెంపు
- హర్షం వ్యక్తం చేస్తున్న సిబ్బంది
కుయ్.. కుయ్.. అనే శబ్దం వినగానే మనకు వెంటనే అర్థమయ్యేది మన ప్రాంతంలో ఎవరో అనారోగ్యంగా ఉన్నారని. వారి ప్రాణాలకు కాపాడటానికి అంబులెన్స్ వచ్చిందని. అలాంటి ప్రజారోగ్య రంగంలో అత్యవసర సేవలు అందిస్తున్న 108 సిబ్బందికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ శుభవార్త అందించారు.
డ్రైవర్ల జీతాన్ని ప్రస్తుత రూ. 10 వేల నుంచి సర్వీసును బట్టి రూ. 18 వేల నుంచి రూ. 20 వేల వరకు పెంచుతున్నట్టు ప్రకటించారు. ఎమర్జన్సీ మెడికల్ టెక్నీషియన్ల జీతాలను ప్రస్తుత రూ.12 వేల నుంచి సర్వీసును బట్టి రూ.20 నుంచి రూ 30 వేలకు పెంచుతున్నట్టు ప్రకటించారు.
ఈరోజు గుంటూరు జీజీహెచ్ లోని నాట్కో కేన్సర్ బ్లాక్ ను జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 108 సిబ్బంది జీతాలను పెంచబోతున్నట్లు కీలక ప్రకటన చేశారు.
విజయవాడలో 1,088 వాహనాలను (108, 104) ఈరోజు జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మెడికల్ టెక్నీషియన్ల జీతాలను రూ. 20 వేల నుంచి రూ. 30 వేల వరకు పెంచుతున్నట్టు ప్రకటించారు. సీఎం చేసిన ప్రకటనతో 108 సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.