Chandrababu: వర్ల రామయ్య భద్రతపై.. ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు చంద్రబాబు లేఖ
- వర్ల రామయ్యకు వన్ ప్లస్ వన్ భద్రతను తొలగించడం పట్ల లేఖ
- ప్రజా సేవకు కట్టుబడి ఉన్న సీనియర్ నాయకుడని వ్యాఖ్య
- వర్ల రామయ్య మాజీ పోలీసు అధికారి అన్న చంద్రబాబు
- భద్రత గురించి ఆందోళన చెందుతున్నామని వ్యాఖ్య
టీడీసీ నేత వర్ల రామయ్యకు వన్ ప్లస్ వన్ భద్రతను తొలగించడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దాన్ని పునరుద్ధరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు లేఖ రాశారు. వర్ల రామయ్య ప్రజా సేవకు కట్టుబడి ఉన్న సీనియర్ నాయకుడని చంద్రబాబు అందులో పేర్కొన్నారు.
ఏపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను మీడియా ముందు నిలదీసే ముఖ్య ప్రతినిధి వర్ల రామయ్యని తెలిపారు. ఆయన రాజకీయ నేతగానే కాకుండా మాజీ పోలీసు అధికారి అని కూడా గుర్తు చేశారు. ఎస్టీఎఫ్, ఉగ్రవాద వ్యతిరేక శాఖలోనూ పనిచేశారని చెప్పారు. ఆయనకు కాంగ్రెస్ ప్రభుత్వం వన్ ప్లస్ వన్ భద్రతను పదేళ్ల పాటు కొనసాగించిందని గుర్తు చేశారు.
ఏపీలో హింస, బెదిరింపులతో కొనసాగుతోన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన భద్రత గురించి తాము ఆందోళన చెందుతున్నామన్నారు. మీడియా ముందు అవినీతి, అసాంఘిక వ్యతిరేక కార్యకలాపాల వంటి అంశాలపై నిలదీస్తోన్న ఆయనకు కొందరి నుంచి ముప్పు ఉండే అవకాశం ఉందని, ఆయనకు భద్రత కల్పించాలని కోరారు.