Harish Rao: కొండపోచమ్మ సాగర్ కాలువకు గండి.. హరీశ్ స్పందన
- కాంగ్రెస్ హయాంలో ఎన్నో కాలువలు, ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి
- ఎస్ఆర్ఎస్పీ కాలువకు గండ్లు పడ్డాయి
- విపక్షాలది అనవసర రాద్ధాంతం
తెలంగాణలో ఇటీవలే ప్రారంభించిన కొండపోచమ్మ కాలువకు గండి పడిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. దీనిపై మంత్రి హరీశ్ రావు స్పందిస్తూ... విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు.
కాంగ్రెస్ హయాంలో ఎన్నో కాలువలు, ప్రాజెక్టులు కొట్టుకుపోయాయని చెప్పారు. ఎస్ఆర్ఎస్పీని ప్రారంభించినప్పుడు కాలువకు రెండు చోట్ల గండ్లు పడ్డాయని చెప్పారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణ దశలోనే గోదావరిలో కొట్టుకుపోయిందని అన్నారు. దేవాదుల పైపులు పేలిపోయాయని చెప్పారు.
గుజరాత్ లో సర్దార్ సరోవర్ ప్రాజెక్టు కాలువకు 200 సార్లు గండ్లు పడ్డాయని హరీశ్ అన్నారు. మనోహరాబాద్ లో రైల్వే ట్రాక్ కొట్టుకుపోయిందని... దీనికి ప్రధాని కారణమా? అని ప్రశ్నించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చెరువులు నింపిన ఘనత టీఆర్ఎస్ దేనని చెప్పారు.