Telangana: సగం పూర్తయిన కాళేశ్వరం ప్రాజెక్టును చూపించడం తప్ప కేసీఆర్ చేసిందేమీ లేదు: రాం మాధవ్
- బీజేపీ జన సంవాద్ వర్చువల్ సభలో రాంమాధవ్
- కరోనాను నియంత్రించడంలో తెలంగాణ పూర్తిగా విఫలం
- 2030 వరకు మోదీనే ప్రధాని
70 ఏళ్లలో సాధ్యం కాని ఆర్టికల్ 370ని 70 గంటల్లో రద్దు చేసిన ప్రధాని మోదీ 2030 వరకు అదే పదవిలో కొనసాగుతారని బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ అన్నారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒప్పందాలు చేసుకోవడం లేదని, పోరాటం చేస్తున్నామని అన్నారు. కరోనా వైరస్‌ను నియంత్రించడంలో కేంద్రం సఫలమైందన్న ఆయన అదే శ్రద్ధను రాష్ట్రాలు కూడా చూపించాల్సి ఉందన్నారు.
తెలంగాణలో కరోనా వైరస్ రోజురోజుకు మరింత విస్తరిస్తుండడంపై రాంమాధవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైరస్‌ను నియంత్రించడంలో తెలంగాణ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. రాష్ట్రంలో అవినీతి, అసమర్థ పాలన కొనసాగుతోందని ఆరోపించారు. కరోనా బారిన పడుతున్న వారిని ఇంకెంతకాలం మోసం చేస్తారని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. సగం పూర్తయిన కాళేశ్వరం ప్రాజెక్టును చూపించడం తప్ప ఆయన చేసేది మరేమీ లేదని విమర్శించారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలతో బీజేపీ జన సంవాద్ వర్చువల్ సభలో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.