Anand Mahindra: రెచ్చగొట్టినందుకు చాలా థ్యాంక్స్... చైనాకు ఆనంద్ మహీంద్రా దీటైన జవాబు!
- ఇండియా వస్తువులే మా దగ్గర లేవు
- జాతీయతను పక్కనబెట్టి, వస్తువులను సమకూర్చుకోవాలి
- హ్యూ జిన్ ట్వీట్ పై మండిపడుతున్న భారతీయులు
- ప్రేరణ కలిగించినందుకు కృతజ్ఞతలన్న ఆనంద్ మహీంద్రా
చైనాకు చెందిన 59 యాప్స్ ను నిషేధిస్తూ భారత్ నిర్ణయం తీసుకున్న తరువాత చైనాకు చెందిన ఓ పత్రిక ఎడిటర్ హ్యూ జిన్, వివాదాస్పద ట్వీట్ పెట్టగా, ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా దీటైన సమాధానం ఇచ్చారు. తన సమాధానంతో భారతీయుల సహనం, సంస్కారం ఉత్తమమైనవని చెప్పకనే చెప్పారు.
"భారత్ కు చెందిన వస్తువులను చైనా బ్యాన్ చేయాలని అనుకున్నా, అసలు ఇండియాకు చెందిన వస్తువులే లభించడం లేదు. ఇండియన్ ఫ్రెండ్స్... మీరు జాతీయత కన్నా, మరింత ముఖ్యంగా వస్తువులను సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది" అని హ్యూ జిన్ ట్వీట్ పెట్టారు.
ఇక హ్యూ జిన్ ట్వీట్ ను చూసి భారతీయులు మండిపడుతున్న వేళ, ఇక దీన్ని చూసిన ఆనంద్ మహీంద్రా, తనదైన శైలిలో స్పందించారు. "ఇండియన్స్ ఇప్పటివరకూ అందుకున్న మెసేజ్ లలో ఇదే అత్యంత ప్రభావవంతమైనది. ప్రేరణ కలిగించేలా ఉంది. మమ్మల్ని రెచ్చగొట్టినందుకు ధన్యవాదాలు. మేమే ఆ స్థాయికి ఎదుగుతాము" అంటూ పేర్కొన్నారు.