america: కరోనా మందు రెమ్‌డెసివిర్ స్టాక్ మొత్తాన్ని కొనేసిన అమెరికా!
- కరోనా చికిత్సలో ఉపయోగపడుతున్న 'రెమ్‌డెసివిర్'
- మూడు నెలల వరకు ఉత్పత్తి చేసే డ్రగ్స్ అంతా అమెరికాకే
- ఐదు లక్షల డోసులకు అమెరికా ఆర్డర్లు
- గిలీడ్ సైన్సెస్, భారత జనరిక్ ఫార్మా సంస్థలు ఒప్పందం
కరోనా చికిత్సలో ఉపయోగపడుతున్న 'రెమ్‌డెసివిర్' డ్రగ్ స్టాక్ మొత్తాన్ని అమెరికా కొనేసింది. దీంతో మూడు నెలల వరకు అమెరికా నుంచి ఇతర దేశాలకు ఈ ఔషధం అందదు. అమెరికాకు చెందిన బయో ఫార్మా సంస్థ గిలీడ్ సైన్సెస్ ఈ ఔషధాన్ని అభివృద్ధి చేసింది.
'అమెరికా ఫస్ట్' అనే నినాదంతో ముందుకెళ్తున్న ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ తీరుకి అనుగుణంగా ఆ సంస్థ అమెరికాకే మొదట డ్రగ్ స్టాక్‌నంతా ఇవ్వనుంది. దాదాపు ఐదు లక్షల డోసులకు అమెరికా ఆర్డర్లు ఇచ్చింది. ఈ నెల ఆ సంస్థ ఉత్పత్తి చేసే 100 శాతం డోసులు, ఆగస్టులో ఉత్పత్తి చేసే 90 శాతం, సెప్టెంబరు నెల ఉత్పత్తిలో 90 శాతం డ్రగ్ అమెరికాకే ఇవ్వనుంది.
అమెరికన్లకు ఆ డ్రగ్ అందుబాటులో ఉండేందుకు డొనాల్డ్ ట్రంప్ ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్నారని అమెరికా వైద్యశాఖ మంత్రి అలెక్స్ అజార్ ప్రకటించారు. కాగా, ఈ డ్రగ్స్ విషయంలో అమెరికా ఏకపక్షంగా తీసుకుంటున్న ఈ నిర్ణయాల వల్ల ప్రపంచ దేశాలకు మందు లభించదని లివర్‌పూల్ వర్సిటీ శాస్త్రవేత్త డాక్టర్ ఆండ్రూ హిల్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఎబోలా వైరస్ చికిత్స కోసం ఈ రెమ్‌డెసివిర్‌ను గతంలో అభివృద్ధి చేశారు. అప్పట్లో సుమారు 1.40 లక్షల డోసులను పరీక్షల కోసం పలు దేశాలకు పంపిణీ చేశారు. ఈ డోసులన్నింటినీ ఆయా దేశాలు ఇప్పటికే వాడాయి. కరోనా చికిత్స కోసం మొత్తం ఆరు రెమ్‌డెసివిర్ డోసులను రోగులకు ఇవ్వాల్సి ఉంటుంది.
ఆ డ్రగ్‌కు పేటెంట్ హక్కులున్నాయి. లైసెన్సు పొందిన సంస్థలు మాత్రమే ఈ మందును తయారు చేస్తాయి. ఈ డ్రగ్‌ను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడం కోసం గిలీడ్ సైన్సెస్ భారత్‌కు చెందిన కొన్ని జనరిక్ ఫార్మా సంస్థలతోనూ ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకుంది.
సిప్లా, హెటెరో ల్యాబ్స్‌తో పాటు పలు సంస్థలతో ఒప్పందం కుదిరింది. భారత్‌తో పాటు ప్రపంచంలోని 127 దేశాల్లో ఈ డ్రగ్‌ను విక్రయించే అవకాశం భారత సంస్థలకు లభించింది. డగ్ర్ తయారీకి కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానం గిలీడ్ నుంచి భారతీయ సంస్థలకు బదిలీ అవుతుంది. ఇప్పటికే భారత్‌లోని ఆ రెండు సంస్థలకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతులు ఇచ్చింది.