CCTV: ఢిల్లీలో 1.45 లక్షల చైనా సీసీటీవీ కెమెరాలు.. లైవ్ ఫీడ్ చూడగలిగే యాప్.. పలు విమర్శలు!
- ఢిల్లీలోని అన్ని ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు
- చైనాకు చెందిన హిక్విజన్ సంస్థ నుంచి కొనుగోలు
- లైవ్ ఫీడ్ చూడడానికి ఆ సంస్థ యాప్ డౌన్లోడ్ చేసుకున్న ప్రజలు
- ఆ యాప్ వల్ల నిఘా ప్రమాదం
ఢిల్లీ రోడ్లపై వున్న సీసీటీవీ కెమెరాలపై ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. గతంలో నగరంలోని అన్ని ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడం కోసం సీఎం కేజ్రీవాల్ సర్కారు చైనాకు చెందిన హిక్విజన్ సంస్థ నుంచి 1.45 లక్షల సీసీటీవీ కెమెరాలను కొనుగోలు చేసింది. అయితే, ఈ కెమెరాల లైవ్ ఫీడ్ ను చూడగలిగే ఓ యాప్ ను ఆ సంస్థ తయారుచేసింది. దాంతో నగర ప్రజలు ఆ సంస్థకు చెందిన సదరు మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు.
చైనాతో గాల్వన్ లోయ వద్ద ఉద్రిక్తతలు నెలకొనడం, భారత్ 59 చైనా యాప్లను నిషేధించిన నేపథ్యంలో ఢిల్లీలో ఆ యాప్ వల్ల నిఘా ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. బీజేపీ నేతలు కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తూ కేజ్రీవాల్ సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్నారు.
చైనా నుంచి దిగుమతి చేసుకున్న మొబైల్ ఫోన్లలో లైవ్ ఫీడ్ చూడటానికి ఢిల్లీ ప్రజలు హిక్విజన్ ఐవీఎమ్ఎస్ 4500 అనే యాప్ను డౌన్లోడ్ చేసుకుంటున్నారని ఓ నిపుణుడు చెప్పారు. యాప్ను చైనాకు చెందిన ఆ కంపెనీతో పాటు ఆ దేశ ప్రభుత్వం, ఆర్మీ సులభంగా యాక్సెస్ చేయవచ్చని అన్నారు.
ఢిల్లీలో పరిస్థితులు ఎలా ఉన్నాయన్న విషయాన్ని చైనా చూడగలదని చెప్పారు. ఇటువంటి చర్యలను అడ్డుకోవడానికి అవసరమైన భద్రత ఆ యాప్లో లేదని చెప్పారు. ఢిల్లీలోని కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో హిక్విజన్ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారని తెలిపారు.
ఇది దేశ భద్రతకు ముప్పు తెచ్చిపెట్టే సమస్య అన్నారు. చైనా కంపెనీ హిక్విజన్ నుంచి ప్రభుత్వ సంస్థలు ఉత్పత్తులను కొనుగోలు చేయడాన్ని అమెరికా, యూరోపియన్ దేశాల్లో కూడా నిషేధించారు. హిక్విజన్తో పాటు మరో 19 సంస్థలను చైనా ఆర్మీ నియంత్రిస్తోందని తెలిసింది. ఈ కంపెనీ సీసీ కెమెరాల ధర అతి తక్కువగా ఉంటుండడంతో వాటి కొనుగోళ్లకు ప్రపంచ దేశాలు ఆసక్తి చూపుతాయి.