Ravi Shankar Prasad: చైనా జవాన్ల మరణాలపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ కీలక వ్యాఖ్యలు
- మన జవాన్లు 20 మంది అమరులయ్యారు
- చైనా సైనికులు రెట్టింపు సంఖ్యలో హతమయ్యారు
- దుష్ట చూపు చేసే వారికి భారత్ గట్టి సమాధానం చెపుతుంది
గాల్వాన్ లోయలో చైనాతో చోటుచేసుకున్న ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. చైనా సైనికులు కూడా ఈ ఘర్షణలో ప్రాణాలు కోల్పోయినప్పటికీ... మృతుల సంఖ్య ఎంతో స్పష్టంగా వెల్లడి కాలేదు. చైనా కూడా దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ అంశంపై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. గాల్వాన్ ఘర్షణలో మన జవాన్లు 20 మంది అమరులయ్యారని... చైనా సైనికులు రెట్టింపు సంఖ్యలో హతమయ్యారని చెప్పారు. భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందని... అయితే ఎవరైనా దుష్ట చూపు చూస్తే మాత్రం గట్టి సమాధానం చెపుతుందని అన్నారు.
ఇప్పుడు అందరూ రెండు 'సీ'ల గురించి మాట్లాడుకుంటున్నారని... వాటిలో ఒకటి చైనా కాగా, రెండోది కరోనా వైరస్ అని రవిశంకర్ ప్రసాద్ చమత్కరించారు. ఎంత మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారో కూడా చైనా ఇంత వరకు ప్రకటించలేదని అన్నారు. మన జవాన్ల త్యాగాలను వృథా పోనివ్వబోమని ప్రధాని మోదీ చెప్పారని... ఆ వ్యాఖ్యల వెనుక ఎంతో అర్థం ఉందని చెప్పారు. అదేందో చూపించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు.