Raghu Ramakrishna Raju: అంతా జగన్ కనుసన్నల్లోనే జరుగుతోందనే విషయం ఇప్పుడు అర్థమైంది: రఘురామకృష్ణరాజు
- జగన్ కు తెలియకుండానే అన్నీ జరుగుతున్నాయని అనుకున్నా
- ఢిల్లీకి ఎంపీలను, లాయర్లను ప్రత్యేక విమానంలో పంపిస్తున్నారు
- ఎంపీల ఢిల్లీ పర్యటనతో జరిగేది ఏమీ లేదు
వైసీపీ నేతలపై ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు పుట్టించాయి. ఓ వైపు జగన్ ను పొగుడుతూనే... పార్టీ నేతలపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనపై వేటు వేసేందుకు పార్టీ అధిష్ఠానం సిద్ధమైంది. వైసీపీ ఎంపీలు రేపు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తున్నారు. వీరి వెంట కొందరు లాయర్లు కూడా వెళ్లనున్నారు.
లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాతో వైసీపీ ఎంపీలు భేటీకానున్నారు. రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని వారు కోరనున్నారు. ఈ నేపథ్యంలో రఘురాజు స్పందించారు. ఎంపీల ఢిల్లీ పర్యటనతో ఎలాంటి ఉపయోగం ఉండదని ఆయన అన్నారు. జగన్ కు తెలియకుండానే అన్నీ జరుగుతున్నాయని ఇప్పటి వరకు అనుకున్నానని... ఢిల్లీకి ఎంపీలు, లాయర్లను ప్రత్యేక విమానంలో పంపిస్తున్నారంటే, అంతా జగన్ కనుసన్నల్లోనే జరుగుతోందనే విషయం ఇప్పుడు అర్థమైందని చెప్పారు. ప్రజా సమస్యలను ప్రస్తావించిన వారందరినీ పార్లమెంటు నుంచి సాగనంపితే... పార్లమెంటులో ఎవరూ మిగలరని అన్నారు.
పార్టీకి, సీఎంకి వ్యతిరేకంగా తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని రఘురాజు చెప్పారు. తిరుమల వేంకటేశ్వరామి భూములను అమ్మొద్దని తాను చెప్పానని, జగన్ కూడా ఆ తర్వాత అదే నిర్ణయం తీసుకున్నారని అన్నారు. పేదలకు ఇళ్లను అందించే పథకంలో జరుగుతున్న తప్పులను మాత్రమే తాను ప్రస్తావించానని చెప్పారు.
మరోవైపు ప్రధాని మోదీకి రఘురాజు లేఖ రాశారు. గరీబ్ కల్యాణ్ యోజన పథకాన్ని పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదని లేఖలో పేర్కొన్నారు. దూరదృష్టితో కేంద్రం తీసుకున్న నిర్ణయం 80 కోట్ల మందికి మేలు చేస్తుందని కొనియాడారు. మోదీని దయగల మనిషిగా చరిత్ర గుర్తుంచుకుంటుందని ప్రశంసించారు.