Sajjala Ramakrishnareddy: పోతూపోతూ రాష్ట్ర అప్పును రూ.2.54 లక్షల కోట్లకు చేర్చిన ఘనుడు చంద్రబాబు!: సజ్జల రామకృష్ణారెడ్డి విసుర్లు
- చంద్రబాబును ప్రజలు ఛీకొట్టారంటూ వ్యాఖ్యలు
- జగన్ ను నమ్మారు కాబట్టే అత్యధిక మెజారిటీ ఇచ్చారని వెల్లడి
- చంద్రబాబు జూమ్ కాన్ఫరెన్స్ లకే పరిమితమయ్యారని ఎద్దేవా
ఏపీ ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీపైనా, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుపైనా విమర్శలు చేశారు. 2014లో రూ.90 వేల కోట్లుగా ఉన్న రాష్ట్ర అప్పును పోతూపోతూ రూ.2.54 లక్షల కోట్లకు చేర్చిన ఘనుడు చంద్రబాబు అంటూ వ్యాఖ్యానించారు. ఇవి కాకుండా రూ.40 వేల కోట్ల పెండింగ్ బిల్లులు, రూ.20 వేల కోట్ల కరెంటు బకాయిలను కూడా తన వారసత్వంగా వైఎస్ జగన్ కు ఇచ్చి ఈ పెద్దాయన రిటైరై పక్కకు వెళ్లారని చంద్రబాబు పట్ల వ్యంగ్యం ప్రదర్శించారు. ఇదీ మీ చరిత్ర అంటూ వ్యాఖ్యానించారు.
ఇక, తాము ఏడాదికాలంలో ఏంచేశామో చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవర్ని అడిగినా వివరిస్తారని సజ్జల గర్వంగా తెలిపారు. 1.30 కోట్ల కుటుంబాలకు లబ్ది చేకూరేలా అనేక కార్యక్రమాలు చేపట్టిన ఘనత జగన్ కే దక్కుతుందని అన్నారు. ఒక్క రైతు భరోసా పథకంలోనే ఏడాదిలో తాము రూ.10,400 కోట్లు రైతులకు చెల్లించామని వెల్లడించారు.
"మీ మొహానికి రుణమాఫీ కూడా పూర్తిగా చేయలేకపోయారు. రుణమాఫీలో రూ.87 వేల కోట్లు చెల్లించాల్సి ఉంటే, మీ ఐదేళ్లలో చచ్చీచెడీ రూ.15 వేల కోట్ల రుణమాఫీ చేశారు" అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు జూమ్ కాన్ఫరెన్స్ లకే పరిమితం అయ్యారని, చంద్రబాబు అవాస్తవాలు చెబుతూ అభాసుపాలయ్యారని విమర్శించారు.
చంద్రబాబును ప్రజలు ఛీకొట్టారని, అయినా కూడా చంద్రబాబు విలువ లేకుండా మాట్లాడుతూ చులకన అవుతున్నారని పేర్కొన్నారు. తెలుగు ప్రజలు వివేకవంతులని, అలాంటి వాళ్లను కూడా భ్రమల్లో ముంచెత్తాలని చూస్తున్నారంటూ చంద్రబాబుపై ధ్వజమెత్తారు. జగన్ ను జనం నమ్మారు కాబట్టే పూర్తి మెజారిటీతో అధికారం అప్పగించారని సజ్జల స్పష్టం చేశారు.