Corona Virus: ఓటు నిబంధనలను మార్చేసిన కరోనా.. 65 ఏళ్లు పైబడిన వారికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం!
- కరోనాతో అన్ని అంశాలు ప్రభావితం
- మరికొన్ని నెలల్లో బీహార్ ఎన్నికలు
- హోమ్ క్వారంటైన్ లో ఉన్నవారికి కూడా వర్తింపు
నిన్నటి వరకు ఒకెత్తు... కరోనా వ్యాప్తి మొదలైన తర్వాత మరో ఎత్తు! ఈ మహమ్మారి వైరస్ కారణంగా ప్రజల జీవితాలు తీవ్రస్థాయిలో ప్రభావితం అవుతున్నాయి. వ్యవస్థలు సైతం మార్పులకు లోనయ్యే పరిస్థితి వచ్చింది. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని తాజాగా ఓటింగ్ నిబంధనల్లోనూ మార్పులు చేశారు. ఇకపై 65 ఏళ్లకు పైబడినవారు, కరోనా రోగులు పోలింగ్ కేంద్రాలకు రానవసరంలేదు. వారు పోస్టల్ బ్యాలెట్ సాయంతో ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.
మరికొన్ని నెలల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 1961 నాటి ఎన్నికల చట్టానికి ఈ మేరకు సవరణ చేశారు. స్వల్ప లక్షణాలు కలిగివుండి, ఏ చికిత్స కేంద్రంలోనూ లేకుండా, హోమ్ క్వారంటైన్ లో ఉన్నవారు కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయవచ్చని పేర్కొన్నారు. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో, 65 ఏళ్లకు పైబడినవారికి వైరస్ తో ప్రమాదం ఎక్కువని ఐసీఎంఆర్ పేర్కొనడంతో, వారిని ఇళ్ల నుంచి బయటికి రావొద్దని ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు జారీచేసింది.
ఇప్పటివరకు పోస్టల్ బ్యాలెట్ అనేది ఎన్నికల విధుల్లో ఉన్నవారికి, భారత సాయుధ బలగాల్లో ఉన్నవారికి మాత్రమే వర్తింపజేసేవారు. ఇప్పుడది వృద్ధులకు, కొవిడ్ బాధితులకు కూడా అందుబాటులోకి వస్తోంది. ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం వృద్ధులకు, అనేక రకాల వైకల్యం ఉన్నవారి కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఫిబ్రవరిలో జరిగిన అక్కడి అసెంబ్లీ ఎన్నికల కోసం 80 ఏళ్ల పైబడిన వారికి, దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు వేసే వెసులుబాటు ఇచ్చింది.