Narendra Modi: నరేంద్ర మోదీకి గుణపాఠం తప్పదు... రాహుల్ గాంధీ ఫైర్!
- రైళ్ల ప్రైవేటీకరణపై రాహుల్ విమర్శలు
- పేదలకున్న ప్రయాణ సాధనం అదొక్కటే
- పేదలకు నష్టదాయకమని విమర్శ
రైల్వేలను ప్రైవేటీకరించే దిశగా, కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుండటాన్ని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. ప్రయాణికుల రైళ్లను నడిపేందుకు ప్రైవేట్ సంస్థలను అనుమతించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని రాహుల్ ఆక్షేపించారు. పేద ప్రజల జీవన రేఖను ప్రభుత్వం దూరం చేస్తోందని ఘాటు విమర్శలు చేసిన ఆయన, మోదీ సర్కారుకు ప్రజలే గుణపాఠం చెబుతారని అన్నారు.
తన సోషల్ మీడియా ట్విట్టర్ ఖాతాలో ఓ పత్రిక వార్తను పోస్ట్ చేసిన ఆయన, పేదలకు ఏకైక జీవన రేఖగా ఉన్న ఒకే ఒక్క ప్రయాణ సాధనాన్ని, ఈ ప్రభుత్వం వారి నుంచి లాగేసుకుందని ఆక్షేపించారు. పేదలకు ఏది అవసరమంటే దాన్ని కేంద్రం తీసేసుకుంటోందని అన్నారు. భారతీయ రైల్వేలలో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యాన్ని తాము అంగీకరించబోమని ఆయన స్పష్టం చేశారు. కాగా, 109 మార్గాలలో 151 ఆధునిక ప్రైవేటు రైళ్లను నడపడానికి సంబంధించి ప్రైవేట్ భాగస్వామ్యం కోసం ఇండియన్ రైల్వేస్ అర్హత అభ్యర్థనలను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. రూ. 30 వేల కోట్ల ఆదాయం లక్ష్యంగా ఇండియన్ రైల్వేస్ ఈ నిర్ణయం తీసుకుంది.