Chandrababu: అన్ని కేసులూ అయిపోయి ఇప్పుడు హత్య కేసులు పెడుతున్నారు... బీసీలంటే ఎందుకంత పగ?: చంద్రబాబు
- మోకా భాస్కరరావు హత్యకేసులో కొల్లు రవీంద్రపై ఎఫ్ఐఆర్
- అక్రమ కేసు అంటూ చంద్రబాబు ఆగ్రహం
- మూల్యం చెల్లించుకుంటారంటూ హెచ్చరిక
మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కరరావు హత్య కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పేరు ఎఫ్ఐఆర్ లో చేర్చడం పట్ల టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలపై ఏసీబీ కేసులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, నిర్భయ కేసులు అన్నీ అయిపోయాయని, ఇప్పుడు హత్య కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. పైగా బీసీ నేతలనే లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు బనాయిస్తున్నారు, బీసీ నాయకత్వంపై ఎందుకింత పగబట్టారు? అంటూ నిలదీశారు.
అచ్చెన్నాయుడిపై తప్పుడు కేసు పెట్టారని, యనమల రామకృష్ణుడుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారని, అయ్యన్న పాత్రుడిపై నిర్భయ కేసు పెట్టారని, బీద రవిచంద్ర యాదవ్ పై శాసనమండలిలోనే మంత్రులు దాడి చేశారని ఆరోపించారు. వీటికి కొనసాగింపుగా, మరో బీసీ నేత కొల్లు రవీంద్రపై హత్య కేసు బనాయిస్తారా? అంటూ ప్రశ్నించారు.
మీ ప్రలోభాలకు లొంగకపోతే, మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తే టీడీపీ నేతలపై ఇంతకు తెగిస్తారా? మీకు అలవాటైన హత్యా రాజకీయాలను వారికి అంటగడతారా? అంటూ నిప్పులు చెరిగారు. టీడీపీకి వెన్నెముక బీసీలే అన్న అక్కసుతో, బీసీ నాయకత్వాన్నే అణచివేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి ఇంతకు ఇంత మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.