Narendra Modi: చైనాకు స్పష్టమైన సందేశాన్ని పంపిన మోదీ
- లడఖ్ లో మోదీ పర్యటన
- సైనికులతో మాటామంతీ
- విస్తరణ వాదం ముగిసిందని వ్యాఖ్యలు
ఇవాళ లడఖ్ లోని నిము సైనిక శిబిరాన్ని సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి దళాలతో మమేకం అయ్యారు. దేశ రక్షణలో వారి సేవలను వేనోళ్ల కీర్తించారు. ఈ సందర్భంగా చైనాకు హెచ్చరికలతో కూడిన సందేశాన్ని పంపారు. రాజ్యాలను విస్తరించుకుంటూ పోవాలనుకునే కాలం ఎప్పుడో ముగిసిందని, ఇది అభివృద్ధి శకం అని స్పష్టం చేశారు.
విస్తరణవాదులు ఓడిపోవడమో లేక వారి సేనలు తోకముడిచి పారిపోవడమో జరిగిన విషయం చరిత్రకు తెలుసు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తద్వారా దురాక్రమణలు కట్టిపెట్టి, పొరుగుదేశం సార్వభౌమత్వాన్ని గౌరవించాలని మోదీ తన వ్యాఖ్యల ద్వారా చైనాకు హితవు పలికారు. అంతేకాదు, ఇటీవల గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణల్లో గాయపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్న సైనికులను కూడా మోదీ పరామర్శించారు. వారితో ఆత్మీయ వచనాలు పలికారు.