Mahmood Ali: కరోనా నుంచి కోలుకున్న తెలంగాణ హోంమంత్రి... కుటుంబ సభ్యులు కూడా డిశ్చార్జి

Telangana Home Minister Mahmood Ali discharged after cured from corona

  • ఇటీవలే మహమూద్ అలీకి కరోనా
  • కుమారుడు, మనవడికి సైతం పాజిటివ్
  • జూబ్లీహిల్స్ లోని కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స

ఇటీవలే కరోనా మహమ్మారి బారినపడిన తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ పూర్తిగా కోలుకున్నారు. కొన్నిరోజల కిందట ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలడంతో జూబ్లీహిల్స్ లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. మహమూద్ అలీ కుమారుడు, మనవడికి సైతం కరోనా నిర్ధారణ కావడంతో వారికి కూడా చికిత్స అందించారు. ఇప్పుడందరూ కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు.

దీనిపై మహమూద్ అలీ మాట్లాడుతూ, సర్వశక్తిమంతుడైన ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని, తమ ఆరోగ్యం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెబుతున్నామని తెలిపారు. ఈ సమయంలో తమపై ప్రేమాభిమానాలు ప్రదర్శించి, దీవెనలు అందించిన అందరికీ థ్యాంక్స్ అంటూ తన ప్రకటనలో పేర్కొన్నారు.

మహమూద్ అలీ నివాసంలో మొదట ఆయన భద్రతా సిబ్బందిలో కరోనా కలకలం రేగింది. మొదట ముగ్గురు సెక్యూరిటీ గార్డులకు కరోనా పాజిటివ్ రావడంతో వైద్య సిబ్బంది మంత్రి నివాసానికి చేరుకుని పెద్ద ఎత్తున కరోనా పరీక్షలు నిర్వహించారు. 40 శాంపిల్స్ సేకరించి పరీక్ష చేయగా, మరో ఐదుగురు సెక్యూరిటీ గార్డులు కరోనా బారినపడినట్టు గుర్తించారు. ఆదివారం సాయంత్రం మహమూద్ అలీ వైద్య నివేదిక రాగా, కరోనా పాజిటివ్ అని వెల్లడైంది. ఆపై కుమారుడు, మనవడు కూడా కరోనా బాధితుల జాబితాలో చేరారు.

  • Loading...

More Telugu News