Kumar Sangakkara: వరల్డ్ కప్ ఫైనల్ పై సంగక్కరను 10 గంటల పాటు విచారించిన పోలీసులు... చివరికి ఆధారాలు లేవంటూ తేల్చేసిన దర్యాప్తు బృందం!
- 2011 వరల్డ్ కప్ ఫైనల్ పై లంక మాజీ మంత్రి ఆరోపణలు
- ఫైనల్ ను భారత్ కు అమ్మేశాం అంటూ వ్యాఖ్యలు
- విచారణ తర్వాత లభించని సంగక్కర ఆచూకీ
భారత్ ఆతిథ్యమిచ్చిన 2011 వరల్డ్ కప్ ఫైనల్లో శ్రీలంక జట్టు టీమిండియా చేతిలో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. దీనిపై ఇటీవల శ్రీలంక మాజీ క్రీడల మంత్రి మహీందానంద అలుత్ గామగె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ వరల్డ్ కప్ ఫైనల్ ను భారత్ కు అమ్మేశాం అంటూ ఆరోపించారు. ఫైనల్లో ఫిక్సింగ్ జరిగిందన్న కోణంలో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో, లంక ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించగా, నాడు వరల్డ్ కప్ ఫైనల్ ఆడిన దిగ్గజ బ్యాట్స్ మన్ కుమార సంగక్కరను పోలీసులు విచారించారు.
దాదాపు 10 గంటల పాటు ఈ విచారణ సాగింది. సంగా నుంచి సేకరించిన వివరాలను రికార్డు చేశారు. అయితే, ఈ విచారణ తర్వాత సంగక్కర ఆచూకీ తెలియరాలేదు. విచారణ ముగిసిన తర్వాత ఎక్కడికి వెళ్లాడన్నదానిపై స్పష్టతలేదు. అతని పరిస్థితి ఏంటో తెలియకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.
అయితే, ఈ వ్యవహారంలో ఇంతకుమించి విచారణ జరపాల్సింది ఏమీ కనిపించడం లేదన్న ప్రత్యేక బృందం దర్యాప్తును ఇంతటితో నిలిపివేయాలని నిర్ణయించింది. ఇప్పటికే అరవింద డిసిల్వా, జయవర్ధనే, సంగక్కరలను విచారించిన పోలీసులు అనుమానాస్పద అంశాలేవీ లేవని తేల్చారు. అటు ఐసీసీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. 2011 నాటి వరల్డ్ కప్ ఫైనల్ సమగ్రతను సందేహించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.