Bharat Biotech: అది ఫేక్ న్యూస్... ప్రకటన విడుదల చేసిన భారత్ బయోటెక్
- భారత్ బయోటెక్ ఉపాధ్యక్షుడు వీకే శ్రీనివాస్ పై ప్రచారం
- కరోనా వ్యాక్సిన్ చేయించుకున్నారంటూ న్యూస్ వైరల్
- అది రక్త సేకరణ ఫొటో అని వెల్లడించిన భారత్ బయోటెక్
సోషల్ మీడియాలో అసత్య వార్తలు నిజాలకంటే వేగంగా ప్రయాణించడం సాధారణ విషయం. ఇప్పుడది కరోనా వ్యాక్సిన్ అంశంలోనూ మరోసారి నిరూపితమైంది. కరోనా వ్యాక్సిన్ తీసుకువచ్చేందుకు ఐసీఎంఆర్ తో కలిసి పనిచేస్తున్న భారత్ బయోటెక్ సంస్థ ఆగస్టు 15 నాటికి వ్యాక్సిన్ అందించగలమన్న ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం మానవులపై క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. అయితే, భారత్ బయోటెక్ సంస్థ ఉపాధ్యక్షుడు డాక్టర్ వీకే శ్రీనివాస్ క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా కరోనా వ్యాక్సిన్ చేయించుకున్నారంటూ ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఓ నర్సు ఆయన చేతికి ఇంజెక్షన్ గుచ్చుతున్నట్టుగా ఉన్న ఆ ఫొటో భారత్ బయోటెక్ సంస్థ దృష్టికి వచ్చింది. దాంతో ఆ పరిశోధక సంస్థ వెంటనే వివరణ ఇస్తూ, ఆ ఫొటో వాస్తవం కాదని, ప్రచారం అవుతున్న న్యూస్ ఫేక్ అని స్పష్టం చేసింది. అది తమ ప్రొడక్షన్ స్టాఫ్ కు నిత్యం నిర్వహించే వైద్య పరీక్షల కోసం రక్తం సేకరిస్తున్నప్పటి ఫొటో మాత్రమేనని భారత్ బయోటెక్ ఓ ప్రకటనలో వెల్లడించింది.