Hyderabad: బోసిపోతున్న భాగ్యనగరం.. రోడ్డుపైకి వచ్చేందుకు జంకుతున్న జనం!

Roads in Hyderabad are now in no traffic

  • నగరంలో ప్రతి రోజు వందల సంఖ్యలో కేసులు
  • భయంతో స్వగ్రామాలకు తరలిపోతున్న ఏపీ వాసులు
  • రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్న వైనం  

తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండడం, ముఖ్యంగా హైదరాబాద్‌లో కరోనా కేసులు భయపెట్టే స్థాయిలో పెరుగుతుండడంతో జనం ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. దీనికి తోడు లాక్‌డౌన్ ప్రచారంతో ఏపీ వాసులు నగరాన్ని విడిచిపెడుతుండడంతో భాగ్యనగరంలోని రోడ్లు బోసిపోతున్నాయి. రోడ్లపైకి వచ్చే వాహనాల సంఖ్య కూడా దారుణంగా పడిపోయింది. దీంతో లాక్‌డౌన్ తొలినాటి రోజులు మళ్లీ కనిపిస్తున్నాయి.

హైదరాబాద్‌లో గత పక్షం రోజులుగా రోజుకు దాదాపు వెయ్యి వరకు కేసులు నమోదవుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు మరింత పెరుగుతుండడంతో అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఫలితంగా రోడ్లపైకి వచ్చే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. లాక్‌డౌన్ విధిస్తారన్న ఊహాగానాలతో ఏపీ వాళ్లు ఇప్పటికీ స్వగ్రామాలకు తరలుతుండడంతో చాలా ప్రాంతాల్లోని రోడ్లు పూర్తిగా బోసిపోయాయి.

ఎక్కడో ఒకటీ అరా తప్ప వాహనాల జాడ కనిపించడం లేదు. రోడ్లు ఖాళీగా దర్శనమిస్తుండడంతో ప్రయాణ సమయం బాగా తగ్గింది. గతంలో కూకట్‌పల్లి నుంచి ఎల్బీనగర్‌కు రద్దీ సమయాల్లో గంటంపావుకు పైగా పట్టగా, ఇప్పుడు 45 నిమిషాల్లోనే చేరుకుంటున్నారు. నగరంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ పరిస్థితి ఇలాగే ఉన్నట్టు జూన్ 29 నుంచి ఈ నెల 3 మధ్య పోలీసులు నిర్వహించిన సర్వేలో తేలింది.

  • Loading...

More Telugu News