USA: దక్షిణ చైనా సముద్రంలో అమెరికా విమాన వాహక నౌకల మోహరింపు
- రెండు భారీ నౌకలను తరలించిన అమెరికా
- అదే సమయంలో చైనా నౌకా విన్యాసాలు షురూ
- ప్రాంతీయ స్థిరత్వం కోసం కట్టుబడి ఉన్నామన్న అమెరికా
ఓవైపు కరోనాతో పోరాడుతూనే మరోవైపు చైనాపై ఓ కన్నేసి ఉంచిన అగ్రరాజ్యం అమెరికా తాజాగా తన విమాన వాహక నౌకలను దక్షిణ చైనా సముద్రంలో మోహరించింది. యూఎస్ఎస్ రోనాల్డ్ రీగన్, యూఎస్ఎస్ నిమిట్జ్ విమాన వాహక నౌకలు, మరో నాలుగు యుద్ధ నౌకలు శనివారం నుంచి దక్షిణ చైనా సముద్రంలోనే ఉన్నాయని అమెరికా రక్షణ వర్గాలను ఉటంకిస్తూ వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక పేర్కొంది. ప్రాంతీయ భద్రత, స్థిరత్వం కోసం అమెరికా కట్టుబడి ఉందని తన మిత్రపక్షాలకు చాటిచెప్పడమే ఈ మోహరింపుల వెనుక ప్రధాన ఉద్దేశమని రియర్ అడ్మిరల్ జార్జ్ ఎం వికోఫ్ పేర్కొన్నారని వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది.
అయితే ఇదే సమయంలో చైనా సముద్ర జలాల్లో నౌకా విన్యాసాలకు తెరలేపింది. దీనిపై వికోఫ్ స్పందిస్తూ, తాము విమాన వాహక నౌకలు తీసుకువచ్చింది చైనా సముద్ర విన్యాసాలకు ప్రతిగా కాదని స్పష్టం చేశారు. కాగా, దక్షిణ చైనా సముద్రంలో సహజవాయు, చమురు వనరుల కోసం చైనా కొంతకాలంగా ఆక్రమణలకు పాల్పడుతూ, పొరుగు దేశాలను భయభ్రాంతులకు గురిచేస్తోందని అమెరికా ఆరోపిస్తోంది.