Swine Flu G4: స్వైన్ ఫ్లూ సరికొత్త వెర్షన్ 'జీ4' సామర్థ్యంపై స్పష్టతనిచ్చిన చైనా
- చైనాలో పందుల్లో విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ
- ఇది అత్యంత ప్రమాదకరం అని హెచ్చరించిన చైనా శాస్త్రవేత్తలు
- ఇది మామూలు వైరస్సే అంటున్న చైనా వ్యవసాయశాఖ
చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఇప్పుడు యావత్ మానవాళి పాలిట మృత్యుఘంటికలు మోగిస్తోంది. ఓవైపు కరోనా కోరలు చాస్తున్న తరుణంలో నేనున్నానంటూ స్వైన్ ఫ్లూ వైరస్ కూడా కలకలం రేపుతోంది. చైనాలో ఇప్పటికే పెద్ద ఎత్తున పందులు మరణిస్తున్నాయని, అందుకు కారణం స్వైన్ ఫ్లూ జీ4 వైరస్ పోచలే కారణమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇది అత్యంత ప్రమాదకరం అంటూ చైనా సైంటిస్టుల బృందం ఓ అమెరికా సైన్స్ పత్రికలో వెల్లడించింది. ఇది మనుషులకు అత్యంత వేగంగా వ్యాపిస్తుందని, మహమ్మారిగా మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుందని తమ అధ్యయనంలో పేర్కొంది.
అయితే ఈ వాదనలను చైనా వ్యవసాయ శాఖ కొట్టిపారేసింది. స్వైన్ ఫ్లూ వైరస్ జీ4 జాతికి అంత శక్తి లేదని, దీనికి ఇతరులకు సోకే సామర్థ్యం చాలా తక్కువ అని వివరించింది. జీ4 వైరస్ జాతి గురించి సైన్స్ పత్రికల్లో వస్తున్న వార్తలు మరీ వాస్తవ దూరంగా ఉన్నాయని, అందులో శాస్త్రీయత లోపించిందని ఆరోపించింది. అసలు, పందుల్లో ఈ వైరస్ ఎలా ప్రమాదకరమో కూడా సదరు శాస్త్రవేత్తలు నిరూపించలేకపోయారని తెలిపింది.
ఇది మనిషి శరీరంలో తన కణజాలాన్ని పెంచుకోలేదని, వ్యాధి లక్షణాలు కలిగించలేదని తెలిపింది. అంతేకాదు, అందరూ అనుకుంటున్నట్టు స్వైన్ ఫ్లూ జీ4 వైరస్ కొత్తదేమీ కాదని, 2011 నుంచి చైనాలోని అనేక ఏజెన్సీలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కూడా ఈ వైరస్ పై ఓ కన్నేసి ఉంచాయని చైనా వ్యవసాయ మంత్రిత్వ శాఖ వివరించింది.