ICMR: కరోనా వ్యాక్సిన్ పై వస్తున్న విమర్శలకు బదులిచ్చిన ఐసీఎంఆర్
- కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ కు అనుమతించిన ఐసీఎంఆర్
- హడావుడిగా అనుమతి ఇవ్వడమేంటని విమర్శలు
- కోవాగ్జిన్ సంతృప్తికరంగా ఉందని వెల్లడించిన ఐసీఎంఆర్
ఇతర దేశాలను ఆశ్చర్యానికి గురిచేస్తూ భారత్ అతి తక్కువ వ్యవధిలో కరోనాకు వ్యాక్సిన్ తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. కోవాగ్జిన్ పేరుతో ఈ టీకాను భారత్ బయోటెక్ రూపొందించింది. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ లో ఉంది. అయితే, చాలా తక్కువ సమయంలో వ్యాక్సిన్ తీసుకురావడం ఎంతో ప్రమాదకరమని విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ వ్యాక్సిన్ పరిశోధనలో పాలుపంచుకుంటున్న భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) స్పందించింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగానే వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించింది.
అయితే భారత్ లో అత్యవసర పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వ్యాక్సిన్ ను త్వరగా తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, తొలి దశ ప్రయోగాలు విజయవంతం కావడంతో రెండో దశ ప్రయోగాలకు అనుమతి ఇచ్చామని స్పష్టం చేసింది. భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ కు సంబంధించిన సమాచారం సంతృప్తికరంగా ఉండడంతో ప్రోత్సహిస్తున్నామని వివరించింది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వేగంగా అనుమతులు మంజూరు చేశామని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది.