USA: యూఎస్ అధ్యక్ష రేసులో అనూహ్య మలుపు... రంగంలోకి దిగిన కెన్యే వెస్ట్... మద్దతు పలికిన ఎలాన్ ముస్క్!
- అధ్యక్ష పదవికి పోటీ చేస్తానన్న కెన్యే వెస్ట్
- భవిష్యత్తును మనమే నిర్ణయించుకోవాలని వ్యాఖ్య
- అమెరికాలో మొదలైన కొత్త చర్చ
మరో నాలుగు నెలల్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగాల్సిన తరుణంలో అనూహ్యంగా రిపబ్లికన్ల తరఫున ప్రముఖ ర్యాపర్, కిమ్ కర్దాషియన్ భర్త కెన్యే వెస్ట్ రంగంలోకి దిగారు. అధ్యక్షుడు ట్రంప్ కు గతంలో మద్దతు పలికిన కెన్యే, ఇప్పుడు ఆయన్నే చాలెంజ్ చేస్తున్నారు. ఇదే సమయంలో టెస్లా అధినేత ఎలాన్ ముస్క్ ఆయనకు మద్దతు పలకడంతో, దేశవ్యాప్తంగా ఇదే చర్చనీయాంశమైంది. తాను మాజీ ఉపాధ్యక్షుడు, ప్రస్తుతం డెమోక్రాట్ల తరఫున పోటీ చేస్తున్న జో బిడెన్ తో పోటీ పడతానని ఆయన ప్రకటించారు. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసే అభ్యర్థులకు కావాల్సిన కనీస మద్దతుదారుల కోసం పోలింగ్ ఇప్పటికీ చాలా రాష్ట్రాల్లో కొనసాగుతూనే ఉన్న నేపథ్యంలో, తనకూ అవకాశాలు ఉన్నాయని ఆయన అంటున్నారు.
"నేను అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నా. దేవుడిపై నమ్మకం ఉంచే అమెరికన్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సి వుంది. మన భవిష్యత్తును మనమే నిర్ణయించుకోవాలి" అని తన సోషల్ మీడియా ఖాతాలో కెన్యే వెస్ట్ వ్యాఖ్యానించారు. కాగా, ఈ విషయంలో కెన్యే ఎంత సీరియస్ గా ఉన్నారన్న చర్చ ఇప్పుడు మొదలైంది. నవంబర్ 3న ఎన్నికలు జరగనున్నాయన్న సంగతి తెలిసిందే. గతంలో తన భార్య కిమ్ తో కలిసి కెన్యే వెస్ట్ వైట్ హౌస్ ను కూడా సందర్శించారు.