Harish Rao: కరోనా బాధితులకు ఫోన్ చేసి వైద్య, ఆరోగ్య సిబ్బంది పనితీరు అడిగి తెలుసుకున్న హరీశ్ రావు
- సంగారెడ్డి జిల్లా కలెక్టర్ చాంబర్ లో హరీశ్ రావు సమీక్ష
- కరోనా బాధితులను ఫోన్ లో పరామర్శించిన వైనం
- కరోనా రోగుల్లో మనోధైర్యం పెపొందించాలంటూ అధికారులకు సూచన
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఉగ్రరూపం దాల్చింది. రోజూ వెయ్యికి తగ్గకుండా కొత్త కేసులు వస్తుండడం అధికార యంత్రాంగంలో కలవరం కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలో కరోనా పరిస్థితులపై మంత్రి హరీశ్ రావు కలెక్టర్ చాంబర్ లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు కొందరు కరోనా బాధితులకు స్వయంగా ఫోన్ చేసి పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు.
హోం క్వారంటైన్ లో ఉన్నవారిని ఆరోగ్య సిబ్బంది సందర్శించి సేవలు, సూచనలు అందిస్తున్నారా? ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారు? సిబ్బంది తరచుగా వచ్చి పరీక్షలు చేస్తున్నారా? లేదా? అని అడిగారు. బాధితులు సానుకూలంగానే మాట్లాడడంతో హరీశ్ రావు సంతృప్తి వ్యక్తం చేశారు. ఆపై, అధికారులతో మాట్లాడుతూ, కరోనా బాధితుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా వ్యవహరించాలని సూచించారు.