1984 anti-Sikh riots: కరోనాతో మృతి చెందిన సిక్కుల ఊచకోత దోషి మహేందర్ యాదవ్
- మండోలి జైలులో శిక్ష అనుభవిస్తున్న మహేందర్ యాదవ్
- గత నెల 26న కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ
- అదే జైలులో హత్యకేసు దోషి కన్వర్ సింగ్ కరోనాతో మృతి
1984 నాటి సిక్కుల ఊచకోత కేసు దోషి మహేందర్ యాదవ్ (70) కోవిడ్ సంబంధిత లక్షణాలతో మృతి చెందాడు. ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే కూడా అయిన మహేందర్ సిక్కుల ఊచకోత కేసులో దోషిగా తేలి ఢిల్లీలోని మండోలి జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఢిల్లీ జైలులో కరోనాతో ఖైదీ మరణించిన ఘటన ఇది రెండోది. జైలులోని 14వ నంబరు గదిలో ఉంటున్న మహేందర్ యాదవ్.. గత నెల 26న తనకు అస్వస్థతగా ఉన్నట్టు జైలు అధికారులకు తెలిపాడు. దీంతో అతడికి పరీక్షలు చేయగా కరోనా సోకినట్టు తేలింది. దీంతో కుటుంబ సభ్యుల అభ్యర్ధనపై ద్వారకలోని ఆకాశ్ హెల్త్‌కేర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతి చెందాడు.
యాదవ్‌కు కరోనా పాజిటివ్ అని తేలిన వెంటనే డీడీయూ ఆసుపత్రికి తరలించామని, అక్కడతడు తనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని, గుండె సంబంధిత సమస్యలు కూడా ఉన్నట్టు చెప్పడంతో ఆ తర్వాతి రోజు లోక్‌నాయక్ ఆసుపత్రికి తరలించినట్టు ఢిల్లీ జైళ్ల శాఖ డీజీ సందీప్ గోయల్ తెలిపారు. కాగా, ఇదే జైలులో ఓ హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న కన్వర్ సింగ్ జూన్ 15న కోవిడ్‌తో మరణించాడు.