BS Raju: ప్రస్తుతం పాకిస్థాన్ ఎటువంటి కవ్వింపులకూ దిగడంలేదట!
- ఎలాంటి దుశ్చర్యలకూ పాల్పడటం లేదు
- డిఫెన్స్ స్థావరాలను అప్ గ్రేడ్ చేస్తున్నపాక్
- ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధం
- వెల్లడించిన లెఫ్టినెంట్ కల్నల్ బీఎస్ రాజు
చైనాతో సరిహద్దుల్లో విభేదాలు నెలకొన్న వేళ, పాకిస్థాన్ స్తబ్ధుగా ఉంది. జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తున్న పాక్, ప్రస్తుతానికి ఎటువంటి కవ్వింపు చర్యలకూ పాల్పడటం లేదని శ్రీనగర్ లోని 15 కార్ప్స్ కమాండర్, లెఫ్టినెంట్ కల్నల్ బీఎస్ రాజు వెల్లడించారు. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, పాక్ ఆక్రమిత కశ్మీర్లో సైతం పాక్ సైనికులు ఎటువంటి దుశ్చర్యలకూ పాల్పడటం లేదని అన్నారు.
"ఈ రోజు వరకూ నేను గమనించిన దాని ప్రకారం, పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఎటువంటి డెవలప్ మెంట్స్ కనిపించడం లేదు. నేను బాధ్యత వహించిన ప్రాంతంలో ఎటువంటి కార్యకలాపాలూ జరగడం లేదు. ఇదే సమయంలో పాకిస్థాన్ తమ డిఫెన్స్ స్థావరాలను అప్ గ్రేడ్ చేస్తోంది. ఇరు దేశాల మధ్యా ఉద్రిక్తతలు నెలకొనే సమయంలోనే ఇలా జరుగుతుంది. మేము కూడా ఎటువంటి పరిస్థితి ఎదురైనా, బదులిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం" అని అన్నారు.
పాకిస్థాన్ సైన్యం అదనపు దళాలను తరలిస్తున్నట్టు మాత్రం సమాచారం ఉందని, ఇదే సమయంలో ఈ ప్రాంతంలో హింసాత్మక చర్యలను ప్రేరేపిస్తోందని, స్వయంగా మాత్రం ఎటువంటి ఉల్లంఘనలకూ పాల్పడటం లేదని బీఎస్ రాజు తెలిపారు. సాధారణంగా నిత్యమూ చొరబాటుదారులను పంపించే పాకిస్థాన్ లాంచ్ ప్యాడ్స్ లో ఇప్పుడు సందడి కనిపించడం లేదని, ఇదే సమయంలో దాదాపు 300 మంది పై నుంచి ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. తన సైనికులు వారిని ఆహ్వానించేందుకు వేచివున్నారని అన్నారు.
15 కార్ప్స్ చాలా బలమైన దళమని, వాస్తవాధీన రేఖ వెంబడి అనుక్షణమూ అప్రమత్తంగా ఉన్నామని, అవతలివైపు నుంచి ఏ విధమైన కవ్వింపులు వచ్చినా, చొరబాటుదారులు హద్దులు దాటినా దీటుగా ఎదుర్కొంటామని అన్నారు. ఇక్కడ శాంతిని కాపాడేందుకు తమవంతు ప్రయత్నాలను చేస్తున్నామని, సరిహద్దుల్లో ఏ విధమైన అవాంఛనీయ కార్యకలాపాలు జరుగరాదన్నదే తమ అభిమతమని తెలిపారు.