Priyanka Gandhi: ప్రియాంక గాంధీ బంగళాను బీజేపీ ఎంపీకి కేటాయించిన ప్రభుత్వం
- బీజేపీ ఎంపీ అనిల్ బలూనీకి లోధీ రోడ్డులోని బంగళా కేటాయింపు
- ఆగస్టు ఒకటో తేదీలోగా ఖాళీ చేయాలంటూ ప్రియాంకకు కేంద్రం నోటీసులు
- బంగళా కేటాయింపును రాజకీయం చేయాల్సిన అవసరం లేదన్న అధికారులు
ఆగస్టు ఒకటో తేదీ లోగా ప్రభుత్వ బంగళాను ఖాళీ చేయాలంటూ కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీకి నోటీసులు పంపిన కేంద్రం.. ఆమె బంగళాను బీజేపీ ఎంపీ, మీడియాసెల్ ఇన్‌చార్జ్ అనిల్ బలూనికి కేటాయించింది. ఈ మేరకు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ మంత్రిత్వ శాఖ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. కేన్సర్ బారినపడి చికిత్స తీసుకుంటున్న బలూని ప్రస్తుతం న్యూ ఢిల్లీలోని గురుద్వారా రాకాబ్‌గంజ్ రోడ్డులో ఉంటున్నారు. అనారోగ్య కారణాలతో తన నివాసాన్ని మార్చాలంటూ ఆయన చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ప్రియాంక ప్రస్తుతం ఉంటున్న బంగళాను ఆయనకు కేటాయించింది.
బంగళా కేటాయింపు విషయాన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదని, ప్రియాంక ఖాళీ చేసిన వెంటనే బలూని అక్కడికి మారతారని అధికారులు పేర్కొన్నారు. ప్రియాంక గాంధీకి ఎస్పీజీ భద్రత లేకపోవడంతో లోధీ రోడ్డులోని బంగళాను ఖాళీ చేయాలంటూ ఇటీవల ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. బంగళాను ఖాళీ చేసేందుకు ఆగస్టు 1ని తుది గడువుగా పేర్కొన్న ప్రభుత్వం ఆ తర్వాత కూడా కొనసాగితే జరిమానా తప్పదని హెచ్చరించింది. కాగా, ప్రియాంక గాంధీకి ఇప్పటి వరకు ఉన్న ఎస్పీజీ భద్రతను ప్రభుత్వం ఇటీవలే తొలగించింది.