Cow Dung: పేడే కదా అని చులకనగా చూడకండి.. గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించిన చత్తీస్ గఢ్!
- గ్రామీణులకు అండగా కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించిన చత్తీస్ గఢ్ ప్రభుత్వం
- వర్మీ కంపోస్ట్ తయారీలో పేడను వినియోగించనున్న వైనం
- గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుందన్న సీఎం
పేడే కదా అని చులకనగా చూడకండి. పేడ కూడా మీకు ఆర్థికంగా అండగా ఉండే రోజులు రాబోతున్నాయి. మన దేశంలో చత్తీస్ గఢ్ లో పేడ కొనుగోలుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రాబోయే రోజుల్లో మన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టినా ఆశ్చర్యం లేదు. పశు సంపదపై ఆధారపడే గ్రామీణులకు అండగా నిలిచేందుకు చత్తీస్ గఢ్ ప్రభుత్వం 'గోధన్ న్యాయ్' పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా కిలో పేడను రూ. 1.50కి కొనుగోలు చేయనుంది. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు చేసే పేడను వర్మీ కంపోస్ట్ తయారీలో వినియోగించనుంది.
ఈ సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ భాగేల్ మాట్లాడుతూ, ఈ పథకం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుందని తెలిపారు. స్వయం సహాయక బృందాల్లోని మహిళలు ఇంటింటికీ వెళ్లి పేడను సేకరిస్తారని చెప్పారు. ఈ పథకం కోసం ఓ కార్డును జారీ చేస్తామని... పేడ కొనుగోలు తేదీ, వివరాలను ఇందులో నమోదు చేస్తామని తెలిపారు. ఈ పథకాన్ని పర్యవేక్షించేందుకు గ్రామ స్థాయిలో గోధన్ కమిటీలను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. పట్టణాలు, నగరాల్లో ఈ కార్యక్రమాన్ని పురపాలక సంఘాలు పర్యవేక్షిస్తాయని తెలిపారు.