Pawan Kalyan: వనజీవి రామయ్య నా గురించి చెప్పిన మాటలు నాలో మరింత బాధ్యతను పెంచాయి: పవన్ కల్యాణ్
- రామయ్య మాటలు శిరోధార్యమన్న పవన్
- వనజీవి పేరును సార్థకం చేసుకున్నారని వ్యాఖ్యలు
- రామయ్యకు దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్ష
సామాజిక వనాల అభివృద్ధే పరమావధిగా కోటికి పైగా మొక్కలు నాటి వనజీవిగా పేరొందిన దరిపెల్లి రామయ్య తనలాంటి వారెందరికో ఆదర్శప్రాయుడని జనసేనాని పవన్ కల్యాణ్ కొనియాడారు. ఎలాంటి స్వలాభాపేక్ష లేకుండా చెట్లు నాటుతూ, వనాలు పెంచుతున్న రామయ్యను పద్మశ్రీ పురస్కారం కూడా వెతుక్కుంటూ వచ్చిందని గుర్తుచేశారు. అంతటి మహనీయుడు వనజీవి రామయ్య ఓ వీడియోలో తన గురించి చెప్పిన మాటలు తనలో ఎంతో బాధ్యతను పెంచాయని పేర్కొన్నారు. ఆయన మాటలను శిరోధార్యంగా భావిస్తానని అన్నారు.
మొక్కలపై ఆయనకున్న మమకారం ఎనలేనిదని, చివరికి తన నలుగురు మనవరాళ్లకు కూడా మొక్కల పేర్లే పెట్టుకుని వనజీవి అనే బిరుదును సార్థకం చేసుకున్నారని పవన్ కీర్తించారు. రామయ్యకు దీర్ఘాయుష్షు కలగాలని కోరుకుంటున్నామని, డొక్కా సీతమ్మ పేరిట ఆహార శిబిరాలు నిర్వహించిన విధంగానే, వనజీవి రామయ్య పేరు మీద పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తామని వివరించారు.