Ganguly: వన్డేల్లో సచిన్ ఎందుకు స్ట్రయికింగ్ తీసుకునేవాడు కాదో వెల్లడించిన గంగూలీ
- ఫామ్ లో ఉన్నప్పుడు ఎక్కువ సేపు క్రీజులో ఉండాలనుకునేవాడు
- ఫామ్ లో లేనప్పుడు ఒత్తిడి తగ్గించుకోవాలనుకునేవాడు
- ఒకటి, రెండు సార్లు ఫస్ట్ బాల్ ఎదుర్కొని ఉంటాడు
ప్రపంచ క్రికెట్లో అత్యున్నత ఓపెనింగ్ జోడీల్లో సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ జోడీ ఒకటి. వీరిద్దరి రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్ దిగ్గజ బౌలర్లకు సైతం మింగుడు పడేది కాదు. బంతులను అలవోకగా బౌండరీలకు తరలిస్తూ... వీరిద్దరూ చేసిన బ్యాటింగ్ విన్యాసాలు ప్రేక్షకులను ఇప్పటికీ మైమరపిస్తాయి. ఇప్పటికీ వీరిద్దరి మధ్య అన్యోన్యమైన అనుబంధం అలాగే కొనసాగుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో గంగూలీ మాట్లాడుతూ, వన్డేల్లో తొలి బంతిని ఎదుర్కోవడానికి సచిన్ ఇష్టపడేవాడు కాదని చెప్పారు.
స్ట్రయిక్ తీసుకోమని అప్పుడప్పుడు తాను చెప్పేవాడినని... దానికి సచిన్ వద్ద సమాధానాలు రెడీగా ఉండేవని గంగూలీ అన్నారు. సచిన్ ఫుల్ బ్యాటింగ్ ఫామ్ లో ఉన్నప్పుడు... నాన్ స్ట్రయికింగ్ ఎండ్ లో ఉండాలని భావించేవాడని, తద్వారా ఎక్కువ సేపు క్రీజులో ఉండాలని అనుకునేవాడని చెప్పాడు. ఫామ్ లో లేని సమయంలో కూడా నాన్ స్ట్రయికింగ్ ఎండ్ లో ఉండాలని భావించేవాడని... తద్వారా, తనపై ఉన్న ఒత్తిడిని తగ్గించుకోవాలని అనుకునేవాడని తెలిపారు. ఫామ్ లో ఉన్నా, లేకపోయినా... సచిన్ వద్ద ఒకటే సమాధానం ఉండేదని చెప్పారు. అతనికంటే ముందు వెళ్లి నాన్ స్ట్రయికింగ్ ఎండ్ లో నిలబడితేనే... ఫస్ట్ బాల్ ఎదుర్కొనేవాడని... అది కూడా ఒకటి, రెండు సార్లు జరిగి ఉంటుందని తెలిపారు.
సచిన్, గంగూలీ ఇద్దరూ వన్డేల్లో 136 ఇన్నింగ్స్ ను ఓపెన్ చేశారు. 6,609 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రపంచంలో ఏ దేశం తరపునుంచైనా ఇదే అతి ఎక్కువ ఓపెనింగ్ భాగస్వామ్యం కావడం గమనార్హం.