Atchannaidu: ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలన్న అచ్చెన్నాయుడి పిటిషన్ పై ఎల్లుండి తీర్పు ఇవ్వనున్న హైకోర్టు
- హైకోర్టులో ముగిసిన విచారణలు
- తీర్పును రిజర్వ్ లో ఉంచిన న్యాయస్థానం
- విజయవాడ సబ్ జైలులో ఉన్న అచ్చెన్న
టీడీపీ నేత అచ్చెన్నాయుడు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. ఇవాళ్టి విచారణలో ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును జూలై 8కి వాయిదా వేసింది. తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని, ప్రైవేటు ఆసుపత్రికి తరలించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ అచ్చెన్న పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.
ఈఎస్ఐ కొనుగోళ్ల వ్యవహారంలో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని ఏసీబీ అరెస్ట్ చేసి, కోర్టు ఆదేశాలతో రిమాండుకి తరలించింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు ఇటీవల శస్త్రచికిత్స జరిగింది. అయితే టెక్కలి నుంచి విజయవాడకు తరలించే క్రమంలో గాయం తిరగబెట్టడంతో మళ్లీ ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్నిరోజుల కిందటే అచ్చెన్నను గుంటూరు ప్రభుత్వాసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ఏసీబీ అధికారులు ఆయన్ను విజయవాడ సబ్ జైలుకు తరలించారు.