Eatala Rajender: అర్ధరాత్రి ఈటలకు ఫోన్ చేసిన కరోనా బాధితుడు... పీఏని అలర్ట్ చేసి ప్రాణం కాపాడిన మంత్రి
- ఊపిరి ఆడడంలేదంటూ ఈటలకు తెలిపిన యువకుడు
- వెంటనే తన పీఏని అప్రమత్తం చేసిన ఈటల
- అంబులెన్స్ ద్వారా యువకుడ్ని ఆసుపత్రికి తరలింపు
హైదరాబాదులో మహ్మద్ రఫీ అనే యువకుడు కరోనా సోకడంతో శ్వాస తీసుకునేందుకు తీవ్రంగా ఇబ్బందిపడుతూ నరకయాతన అనుభవించాడు. ఏ ఆసుపత్రిలోనూ చేర్చుకోకపోవడంతో అర్ధరాత్రి వరకు తిరుగుతూనే ఉన్నాడు. అయితే, ఒక్క ఫోన్ కాల్ అతడి ప్రాణాలను నిలబెట్టింది. తనకు ఊపిరి ఆడడంలేదంటూ రఫీ నేరుగా తెలంగాణ ఆరోగ్యమంత్రి ఈటల రాజేందర్ కు ఫోన్ ద్వారా తెలిపాడు. అప్పుడు సమయం అర్ధరాత్రి 12 గంటలు!
అయినప్పటికీ ఏమాత్రం విసుక్కోకుండా ఈటల మానవతా దృక్పథంతో స్పందించి తన పీఏని అప్రమత్తం చేశారు. ఆ యువకుడు ఉన్న ప్రాంతానికి అంబులెన్స్ పంపించి, అతడిని ఆసుపత్రికి తరలించారు. తద్వారా అతడి ప్రాణాలు కాపాడగలిగారు. ఆసుపత్రి బెడ్ పై నుంచి ఆ యువకుడు ఓ వీడియోలో మాట్లాడుతూ మంత్రి ఈటలను దేవుడిగా అభివర్ణించాడు. రాత్రనక, పగలనక శ్రమిస్తున్నారంటూ పేర్కొన్నాడు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, రఫీ మంత్రి ఈటల రాజేందర్ ఫోన్ నెంబర్ ను ఇంటర్నెట్లో చూసి తెలుసుకున్నాడట.