Pawan Kalyan: ఇంద్రకీలాద్రిపై ఇదేం పని..?... ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల మధ్య విభేదాలు సృష్టిస్తారా?: పవన్ కల్యాణ్
- ఇటీవలే ఇంద్రకీలాద్రిపై దర్శనాలు పునఃప్రారంభం
- విధుల్లో చేరాలంటూ కొందరు ఉద్యోగులకే సమాచారం
- మిగతా వాళ్లకు ఎందుకు సమాచారమివ్వలేదన్న పవన్
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువున్న దుర్గమ్మ ఆలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారంటూ జనసేనాని పవన్ కల్యాణ్ ఆరోపించారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా ఆలయాలు మూసివేసిన తరుణంలో దుర్గమ్మ ఆలయాన్ని కూడా మూసివేశారని తెలిపారు. అంతేకాకుండా, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను విధులకు దూరం చేశారని వెల్లడించారు.
కానీ, ఆలయం మళ్లీ తెరుచుకుని, దర్శనాలు పునఃప్రారంభమైన తర్వాత ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో కొందరిని మాత్రమే విధులకు పిలిచి, కొందరికి సమాచారమే ఇవ్వలేదని పవన్ ఆరోపించారు. ఇది కచ్చితంగా ఉద్యోగుల మధ్య విభేదాలు సృష్టించడమేనని మండిపడ్డారు. జీతం మీద ఆధారపడే ఆ చిరుద్యోగుల మధ్య తారతమ్యాలు సృష్టించడం ఎందుకో దేవాదాయ శాఖ జవాబు చెప్పాలని నిలదీశారు. ఈ పరిస్థితిపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు.