Visakhapatnam District: సాయినార్ లైఫ్ సైన్సెస్ ఫార్మా కంపెనీని మూసేయండి: ఆదేశించిన రెండు శాఖలు
- ఆదేశాలు జారీ చేసిన ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, కాలుష్య నియంత్రణ మండలి
- ఘటనలో యాజమాన్యం నిర్లక్ష్యం సుస్పష్టం
- కలెక్టర్‌కు నివేదిక సమర్పించిన నలుగురు సభ్యుల కమిటీ
సాయినార్ లైఫ్ సైన్సెస్ ఫార్మాలో ఇటీవల జరిగిన గ్యాస్ లీక్ ఘటనకు యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని, కాబట్టి కంపెనీని మూసివేయాలని ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలు జారీ చేశాయి. మరోవైపు, జాతీయ హరిత ట్రైబ్యునల్ కూడా గ్యాస్ లీక్ ఘటనను సుమోటోగా తీసుకుని నిన్న విచారణ చేపట్టింది. విశాఖపట్టణంలోని పరవాడలో ఉన్న సాయినార్ లైఫ్ సైన్సెస్ ఫార్మాలో గత నెల 30న జరిగిన గ్యాస్ లీక్ ఘటనలో ఇద్దరు ఉద్యోగులు చనిపోగా, మరో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు.
రియాక్టర్ నుంచి లీకైన హైడ్రోజన్ సల్ఫైడ్‌ను పీల్చడం వల్లే ఉద్యోగులు మృతి చెందినట్టు తేలింది. ఈ ప్రమాదంలో పూర్తిగా యాజమాన్యం నిర్లక్ష్యం ఉందని నిర్ధారణకు వచ్చిన ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, కాలుష్య నియంత్రణ మండలి ఫ్యాక్టరీ మూసివేతకు తాజాగా ఆదేశాలు జారీ చేశాయి. మరోవైపు, ఈ ఘటనపై విచారణ కోసం డీఆర్ఓ పెంచల కిశోర్ అధ్యక్షతన కలెక్టర్ నియమించిన నలుగురు సభ్యుల కమిటీ రెండు రోజుల క్రితమే నివేదికను సమర్పించింది.