Ronnie: ప్రపంచంలోనే అత్యధిక కాలం జీవించిన అవిభక్త కవలల మృతి
- ఈ నెల 4న మృతి చెందిన రోనీ, డోనీ గల్యోన్ సోదరులు
- కార్నివాల్, సర్కస్‌లలో ప్రదర్శనలిస్తూ కుటుంబానికి ఆసరా
- 63వ యేటనే రికార్డు పుస్తకాల్లోకి..
ప్రపంచంలోనే అత్యధిక కాలం జీవించిన సంయోజిత కవలలుగా రికార్డులకెక్కిన రోనీ గల్యోన్, డోనీ గల్యోన్‌లు తమ 68వ యేట మృతి చెందారు. 28 అక్టోబరు 1951న అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో జన్మించిన ఈ కవలలు 2014లో 63 ఏటలోకి ప్రవేశిస్తూనే రికార్డులకెక్కారు. ప్రపంచంలోనే అత్యధిక కాలం జీవించిన సంయోజిత కవలలుగా తమ పేరును రికార్డు పుస్తకాల్లో నమోదు చేసుకున్నారు. చిన్నప్పటి నుంచే సోదరులిద్దరూ కార్నివాల్, సర్కస్‌లలో ప్రదర్శనలు ఇస్తూ అందరినీ ఆకర్షించారు.
తద్వారా వచ్చిన సొమ్ముతో కుటుంబాన్ని పోషించేవారు. డేటన్‌లోని హోస్పిక్ కేర్‌లో ఈ నెల 4న వీరు కన్నుమూసినట్టు వారి సోదరుడు జిమ్ తెలిపారు. 2010లో వీరి గురించి ‘టీఎల్‌సీ’ ఓ డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. 1991లో ప్రదర్శనలకు రిటైర్‌మెంట్ ప్రకటించిన సోదరులిద్దరూ 2010 వరకు ఒంటరిగా నివసించారు. అయితే, ఆ తర్వాత ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తడంతో తిరిగి కుటుంబ సభ్యుల వద్దకు చేరుకున్నారు.