Devineni Uma: రవీంద్రను పరామర్శించేందుకు వస్తే కరోనా అంటున్నారు: దేవినేని ఉమ ఫైర్
- కొల్లు రవీంద్రను కలిసేందుకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లిన టీడీపీ నేతలు
- కరోనా కారణంగా మిలాఖత్ లేదని చెప్పిన జైలు అధికారులు
- జైలు బయట నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన నేతలు
మచిలీపట్నంలో ఓ వైసీపీ నేత హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై అభియోగాలు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయనను ఏ4గా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రవీంద్రకు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో, ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. మరోవైపు, జైల్లో ఉన్న ఆయనను కలిసేందుకు టీడీపీ నేతలు దేవినేని ఉమ, మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తదితరులు వెళ్లారు.
అయితే, రవీంద్రను కలిసేందుకు వీరికి జైలు అధికారులు అనుమతిని ఇవ్వలేదు. కరోనా నేపథ్యంలో మిలాఖత్ కు అనుమతి లేదని అధికారులు చెప్పారు. దీంతో, టీడీపీ నేతలు జైలు బయట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ప్లకార్డులు చేతపట్టి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా దేవినేని ఉమ మాట్లాడుతూ, రవీంద్రను జైల్లో పెట్టినప్పుడు అధికారులకు కరోనా గుర్తుకు రాలేదని... పరామర్శించేందుకు తాము వచ్చినప్పుడు మాత్రం కరోనా అంటున్నారని మండిపడ్డారు. ఒక పథకం ప్రకారమే కొల్లు రవీంద్రపై అక్రమ కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారని అన్నారు. ప్రాథమిక విచారణ కూడా లేకుండా ఎలా అరెస్ట్ చేశారని దుయ్యబట్టారు. ఎనిమిది గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేశామని చెపుతున్న పోలీసులు... తాము అడుగుతున్నా వివరాలను మాత్రం వెల్లడించడం లేదని చెప్పారు.