Telangana: కొనసాగుతున్న సచివాలయ కూల్చివేత పనులు.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
- కూల్చివేతను వ్యతిరేకిస్తున్న విపక్షాలు
- ఆందోళనలు చేపట్టకుండా పటిష్ట భద్రత
- సచివాలయానికి వెళ్లే అన్ని రోడ్లను మూసేసిన పోలీసులు
హైదరాబాద్‌లో సచివాలయ భవనం కూల్చివేత పనులు కొనసాగుతున్న నేపథ్యంలో నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సచివాలయానికి వెళ్లే అన్ని రోడ్లను పోలీసులు మూసివేశారు. కూల్చివేతను వ్యతిరేకిస్తున్న విపక్షాలు ఆందోళనలు చేపట్టకుండా ముందుజాగ్రత్త చర్యగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
ప్రస్తుత సచివాలయ భవనాన్ని కూల్చివేసి దాని స్థానంలో కొత్త భవనాన్ని నిర్మించేందుకు హైకోర్టు అనుమతి ఇవ్వడంతో ప్రభుత్వం నిన్న భవన కూల్చివేత పనులు ప్రారంభించింది. భారీ యంత్రాలతో కూల్చివేత పనులు చేపట్టిన అధికారులు కొత్త నిర్మాణాలకు అనువుగా ఉండేలా 25.5 ఎకరాల ప్రాంగణాన్ని సిద్ధం చేయనున్నారు. ఇందుకోసం కనీసం రెండు వారాల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. కాగా, పాత సచివాలయ భవనం స్థానంలో నిర్మించనున్న కొత్త భవన నమూనా ఫొటోను ప్రభుత్వం నిన్న విడుదల చేసింది.