WHO: గాలి ద్వారా కరోనా వ్యాప్తి వాదనలపై స్పందించిన డబ్ల్యూహెచ్వో
- ఈ వాదనను కాదనలేం
- గాలి ద్వారా వ్యాపిస్తోందనేందుకు ఆధారాలున్నాయి
- అయితే, కచ్చితంగా మాత్రం చెప్పలేం
- ఆధారాలను సేకరించి విశ్లేషించి మరింత స్పష్టత ఇస్తాం
గాలిలోని సూక్ష్మ రేణువుల ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని, ఇందుకు తమ వద్ద ఆధారాలున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో)కు 32 దేశాలకు చెందిన 239 మంది పరిశోధకులు లేఖ రాసిన విషయం తెలిసిందే. కొవిడ్-19 వైరస్ వ్యాప్తిపై ఈ మేరకు సిఫార్సులను సవరించాలని వారు కోరారు.
తాజాగా, ఈ విషయంపై డబ్ల్యూహెచ్వో స్పందించింది. గాలి ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందనే వాదనను కాదనలేమని చెప్పింది. పరిశోధకులు చేస్తోన్న వాదనకు మద్దతు పలికింది. కొవిడ్-19 వైరస్ గాలి ద్వారా వ్యాపిస్తోందనేందుకు ఆధారాలున్నాయని చెబుతూనే, ఆ విషయాన్ని కచ్చితంగా మాత్రం చెప్పలేమని కొవిడ్-19 డబ్ల్యూహెచ్వో టెక్నికల్ లీడ్ చీఫ్ మారియా వాన్ కెర్ఖోవ్ తెలిపారు.
కరోనా వ్యాప్తి చెందుతున్న పద్ధతుల్లో అది కూడా ఒకటై ఉండొచ్చన్నారు. గాలి ద్వారా వైరస్ వ్యాప్తికి సంబంధించిన ఆధారాలను సేకరించి విశ్లేషించి దానిపై మరింత స్పష్టత ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని వివరించారు.