Donald Trump: ట్రంప్ పై ఆయన సోదరుడి కూతురు మేరీ ట్రంప్ ఆరోపణలు!
- అప్పట్లో వార్టన్ బిజినెస్ స్కూల్లో అడ్మిషన్ కోసం ట్రంప్ ప్రయత్నం
- మరొకరితో పరీక్ష రాయించారు
- ఇందుకుగానూ ఆయనకు డబ్బు కూడా ఇచ్చారు
- బాగా చదివే అభ్యర్థికి దక్కాల్సిన సీటును ట్రంప్ కొనుక్కున్నారు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి ప్రపంచానికి తెలియని పలు విషయాలను ఆయన సోదరుడి కూతురు మేరీ ట్రంప్ వెల్లడించారు. క్లినికల్ సైకాలజీలో ఆమె డిగ్రీ చేశారు. ఆమె 'టూ మచ్ అండ్ నెవర్ ఇనఫ్: హౌ మై ఫ్యామిలీ క్రియేటెడ్ వరల్డ్ మోస్ట్ డేంజరస్ మ్యాన్' అనే పుస్తకం రాసి, అందులో తన తండ్రి జూనియర్ ఫ్రెడ్, డొనాల్డ్ ట్రంప్ గురించి ప్రస్తావించారు.
పెన్సిల్వేనియాలోని వార్టన్ బిజినెస్ స్కూల్లో అడ్మిషన్ పొందడం కోసం ట్రంప్ మరొకరితో పరీక్ష రాయించారని ఆమె అందులో ఆరోపించారు. ఇందుకుగానూ ఆయనకు డబ్బు కూడా ఇచ్చారని చెప్పారు. దీంతో ట్రంప్‌కు ఆ ప్రఖ్యాత విద్యాసంస్థలో సీటు వచ్చిందని తెలిపారు. బాగా చదివే అభ్యర్థికి ఆ వర్సిటీలో దక్కాల్సిన సీటును ట్రంప్ అలా కోనేసుకున్నారని ఆమె విమర్శించారు.
మేరీ ట్రంప్ రాసిన ఈ విషయాలను మీడియాలో ప్రచురించారు. వీటిపై వైట్‌హౌస్ అధికారి కెల్యానే కాన్వే స్పందిస్తూ.. సైకాలజీ చదివిన మేరీకి అధ్యక్షుడు ట్రంప్ పేషెంట్ కాదని అన్నారు. ఆయన ఆమెకు అంకుల్ అవుతారని, కుటుంబ విషయాలను కుటుంబ విషయాల్లానే చూడాలని వ్యాఖ్యానించారు. ఈ పుస్తకంలో ఆమె అన్నీ అసత్యాలే రాశారని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కేలే మెకానీ చెప్పారు.